హెటెన్షన్ విద్యుత్ వైరు తగలడంతో క్షణాల్లో దగ్ధమైపోయిన బస్సు
రాజస్థాన్ రాష్ట్రంలో పెళ్లి బృందాన్ని ఎక్కించుకోవడానికి వెళ్తున్న ఓ స్లీపర్ బస్సు భారీ అగ్నిప్రమాదానికి గురైంది. ఈ బస్సుకు కిందకు వేలాడుతున్న హైటెన్షన్ విద్యుత్ తీగ తగలడంతో బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ ఘటనలో సమీపంలో పశువులను మేపుతున్న ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ధోల్పూర్ జిల్లా రాజఖేడా పోలీస్ స్టేషన్ పరిధిలోని సమోనా గ్రామంలో శనివారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. శనివారం సాయంత్రం 5:15 గంటల సమయంలో ఓ స్లీపర్ బస్సు పెళ్లి బృందాన్ని ఎక్కించుకునేందుకు సమోనా గ్రామానికి బయలుదేరింది. మార్గమధ్యంలో కిందకు వేలాడుతున్న హైటెన్షన్ విద్యుత్ తీగను డ్రైవర్ అంచనా వేయలేకపోయాడు. దీంతో బస్సు పైభాగం వైర్‌కు తగలడంతో ఒక్కసారిగా విద్యుత్ ప్రసరించి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సు మొత్తం అగ్నికి ఆహుతైంది.
ఈ ప్రమాదంలో పక్కనే పశువులను మేపుతున్న భగవాన్ దేవి అనే మహిళకు తీవ్ర కాలిన గాయాలయ్యాయి. ఆమెతో పాటు ఐదారు మేకలు కూడా విద్యుదాఘాతంతో మృతి చెందాయి. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని ఆగ్రాకు తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని అరగంటలో మంటలను అదుపులోకి తెచ్చారు.
ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ముప్పు తప్పింది. డీజిల్ ట్యాంక్ పేలుతుందేమోనన్న భయంతో గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్, కండక్టర్ అక్కడి నుంచి పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.