శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 9 డిశెంబరు 2018 (12:58 IST)

కేంద్ర మంత్రి చెంప ఛెళ్లుమనిపించిన అగంతకుడు

రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్.పి.ఐ) అధినేత, కేంద్ర మంత్రి రాందాస్ అథవాలేకి చేదు అనుభవం ఎదురైంది. ఆయన మహారాష్ట్రలోని అంబర్నాథ్ పట్టణ పర్యటనకు శనివారం రాత్రి వెళ్లారు. అపుడు ఓ అగంతకుడు ఆయనపై దాడికి దిగాడు. చెంప ఛెళ్లుమనిపించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
అంబర్‌నాథ్‌లో జరిగిన ఓ సభలో పాల్గొన్న అథవాలే.. కార్యక్రమం ముగిశాక కార్యకర్తలతో ముచ్చటించడం కోసం వేదిక కిందకు చేరుకున్నారు. ఈ సమయంలో ఆకస్మాత్తుగా అథవాలే వైపు దూసుకొచ్చిన ఓ యువకుడు ఆయన చెంపను చెళ్లుమనిపించాడు. 
 
అంతేకాకుండా ఆయనను తోసివేయడానికి ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన అథవాలే భద్రత సిబ్బంది ఆ వ్యక్తిని అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. ఆవేశంలో ఆర్‌పీఐ కార్యకర్తలు నిందితుడిపై దాడికి దిగారు. అనంతరం పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నిందితుడిని ప్రవీణ్‌ గోసావిగా గుర్తించారు. కాగా, ఈ దాడికి గల కారణాలు తెలియరాలేదు.