శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 16 ఫిబ్రవరి 2019 (15:39 IST)

పుల్వామా బాధిత కుటుంబాలకు అండగా వుంటాం.. రిలయన్స్ ఫౌండేషన్

జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా ఆత్మాహుతి దాడిలో అమరులైన సైనికుల కుటుంబాలను ఆదుకునేందుకు రిలయన్స్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. పుల్వామా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రముఖ రిలయన్స్ గ్రూప్ వారి ఫౌండేషన్ సిద్ధమని ప్రకటించింది. ఈ మేరకు శనివారం రిలయన్స్ ఓ ప్రకటనను విడుదల చేసింది. 
 
పుల్వామా ఘటనలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల వారసులను విద్య, ఉపాధి కల్పించడంతో పాటు వారికి జీవితాంతం తోడుందుకు సిద్ధమని.. ఇంకా వారి కుటుంబ సభ్యులకు అన్నివిధాలా సహకరిస్తామని, తగిన సౌకర్యాలు కల్పిస్తామని రిలయన్స్ ఫౌండేషన్ హామీ ఇచ్చింది.
 
అంతేగాకుండా పుల్వామా ఘటనలో గాయాలపాలైన జవాన్లకు మెరుగైన వైద్య సాయం అందించేందుకు తమ ఆస్పత్రులు సిద్ధంగా వున్నట్లు ప్రకటించింది. దేశం కోసం పాటుపడే జవాన్లకు సాయం అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని రిలయన్స్ ఫౌండేషన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. 
 
కాగా భారత సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా పుల్వామా జిల్లా అవంతిపురా ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి 44 మంది జవాన్లు మృత్యువాతపడగా చాలా మంది తీవ్ర గాయాలపాలైయ్యారు. 
 
జైషే మొహమ్మద్ ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. పేలుడు పదార్థాలతో ఉన్న కారు సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌లోకి చొరబడి విధ్వంసాన్ని సృష్టించింది. 2,500 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు 78 బస్సుల్లో జమ్మూ నుంచి శ్రీనగర్‌కు కాన్వాయ్‌గా వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది.