శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 జనవరి 2021 (10:28 IST)

72వ గణతంత్ర దినోత్సవం.. ప్రధాని శుభాకాంక్షలు.. కిసాన్ సమ్మాన్‌ నిధుల పెంపు

modi
72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఉన్న నేషనల్ వార్ మెమోరియల్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. అమర్‌ జవాన్ జ్యోతి వద్ద ప్రధాని మోదీ ఇవాళ నివాళి అర్పించారు. అక్కడ ఆయన పుష్పగుచ్ఛం ఉంచి .. అమర జవాన్లకు నివాళి అర్పించారు. ఆ తర్వాత ఆయన రాజ్‌పథ్ వెళ్లారు. అక్కడ ఆర్డీ పరేడ్‌ను వీక్షించనున్నారు. 
 
యుద్ధ స్మారకం వద్ద ఉన్న సెరిమోనియల్ బుక్‌లో మోదీ సంతకం చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌, ఆర్మీ , నేవీ చీఫ్‌లు కూడా అమర జవాన్ జ్యోతి వద్ద నివాళి అర్పించారు. అంతకుముందు మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన నివాసం వద్ద జాతీయ పతాకాన్ని ఎగరవేశారు.
 
72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం దేశ ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర  మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ భారత ప్రజలందరికీ రిపబ్లిక్‌ డే శుభాకాంక్షలు. జై హింద్‌’ అంటూ ఆయన తన ట్వీట్‌ చేశారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా నిర్వహించే పరేడ్‌ను దృష్టిలో ఉంచుకొని దేశ రాజధాని ఢిల్లీలో భద్రతా దళాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. కోవిడ్-19 నేపథ్యంలో ముఖ్య అతిథి లేకుండానే గణతంత్ర వేడుకలు నిర్వహించారు. 
 
ఇదిలా ఉంటే.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సాయాన్ని పెంచనుంది. ప్రస్తుతం ఇస్తున్న 6వేల ఆర్థిక సాయంతో ప్రయోజనం చూకూరడం లేదని కేంద్రం భావిస్తుంది. 6 వేల సాయాన్ని 10 వేలకు పెంచేందుకు సన్నద్ధం అవుతోంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ వి‍షయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
 
మరోవైపు కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో పీఎం-కిసాన్‌ సాయాన్ని రూ.10 వేలకు పెంచడం ద్వారా రైతుల ఆగ్రహాన్ని కొంత చల్లార్చవచ్చనే అభిప్రాయంలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.