మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 6 డిశెంబరు 2017 (09:10 IST)

ఆర్కేనగర్ బైపోల్ : విశాల్ నామినేషన్ ట్విస్ట్.. నో-ఎస్-నో

చెన్నై ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి ఈనెల 21వ తేదీన జరుగనున్న ఉప ఎన్నికల్లో పోటీ చేసి తన సత్తా చాటాలని భావించిన సినీ నటుడు విశాల్‌కు చుక్కెదురైంది.

చెన్నై ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి ఈనెల 21వ తేదీన జరుగనున్న ఉప ఎన్నికల్లో పోటీ చేసి తన సత్తా చాటాలని భావించిన సినీ నటుడు విశాల్‌కు చుక్కెదురైంది. అనేక నాటకీయ పరిణామాల మధ్య ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఆయన నామినేషన్‌ గంటల వ్యవధిలో తిరస్కరణ, స్వీకరణ… మళ్లీ తిరస్కరణకు గురైంది. దివంగత సీఎం జయలలిత కన్నుమూతతో ఖాళీ అయిన ఆర్కేనగర్‌ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా విశాల్‌ దాఖలు చేసిన నామినేషన్‌పై రోజంతా హైడ్రామా జరిగింది. సోమవారం నామినేషన్ల దాఖలుకు గడువు ముగియగా ఎన్నికల అధికారులు మంగళవారం (డిసెంబర్-5) వాటిని పరిశీలించారు.
 
నామినేషన్‌లో అభ్యర్థిని ప్రతిపాదిస్తూ ఆ నియోజకవర్గానికి చెందిన పది మంది ఓటర్లు సంతకాలు చేయాల్సి ఉంటుంది. విశాల్‌కు సంబంధించిన ఆ పదిమందిలో సుమతి, దీపన్‌ అనే ఇద్దరు ఓటర్లు ఉన్నారు. అయితే… వీరు ఉన్నట్టుండి ప్లేటు ఫిరాయించారు. 'ఆ సంతకాలు మావి కావు. ఎవరో ఫోర్జరీ చేశారు' అంటూ రిటర్నింగ్‌ అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో విశాల్‌ నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు అధికారి ప్రకటించారు. 
 
దీంతో విశాల్‌ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమకు అన్యాయం జరిగిందంటూ విశాల్‌, అతని మద్దతుదారులు రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ముందు బైఠాయించారు. పోలీసులు రంగంలోకి దిగినా, ఇతరులు సర్దిచెప్పినా… విశాల్‌ వెనక్కి తగ్గలేదు. అదే సమయంలో… ఎందుకిలా జరిగిందో స్వయంగా ఆరా తీశారు. సుమతి సమీప బంధువైన వేలు అనే వ్యక్తికి ఫోన్‌ చేశారు. ‘ఎందుకిలా జరిగింది?’ అని ఆరా తీశారు. 
 
అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదన్‌, ఆయన అనుచరుడు రాజేశ్‌ తమ ఇంట్లో మహిళల్ని బెదిరించారని, కొంత డబ్బు ఇచ్చేందుకు కూడా ప్రయత్నించారని, అందుకే తమ కుటుంబీకులు రిటర్నింగ్‌ అధికారికి అలా లేఖ ఇవ్వాల్సి వచ్చిందంటూ వేలు తెలిపారు. ఈ ఆడియో టేప్‌ను విశాల్‌ మీడియాకు విడుదల చేశారు. దీంతో… వివాదం మరో పెద్ద మలుపు తిరిగింది. ఆడియో క్లిప్‌ను విశాల్‌ రిటర్నింగ్‌ అధికారికి అందించారు. చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌ ఏకే జ్యోతితోనూ హీరో విశాల్‌ మాట్లాడారు. దీంతో ఈసీ ఆదేశాలతో… విశాల్‌ నామినేషన్‌ పరిగణనలోకి తీసుకుంటున్నట్లు రాత్రి 8.30 గంటల సమయంలో రిటర్నింగ్‌ అధికారి తెలిపారు.
 
ఈ విషయాన్ని విశాల్‌ స్వయంగా మీడియా సమావేశంలో తెలిపారు. ట్విట్టర్‌లోనూ ఈ వివరాలు పోస్ట్‌ చేశారు. సత్యం గెలిచింది.. ఎన్నికల అధికారి నా నామినేషన్‌ ఆమోదించారంటూ’ విశాల్‌ ట్వీట్‌ చేశారు. అంతేకాదు బుధవారం(డిసెంబర్-6) నుంచి ప్రచారం సాగిస్తానని ప్రకటించారు. అయితే… మంగళవారం(డిసెంబర్-5) రాత్రి 11:30 గంటలకు పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. 
 
'ఆ సంతకాలు తమవి కావని సుమతి, దీపన్‌ స్వయంగా వచ్చి చెప్పారు. దీంతో సుమతి తరపున మరెవరో మాట్లాడుతున్న సంభాషణల టేపులను లెక్కలోకి తీసుకోలేం. విశాల్‌ నామినేషన్‌ తిరస్కరిస్తున్నాం' అని రిటర్నింగ్‌ అధికారి అధికారిక ప్రకటన జారీ చేశారు. దీంతో విశాల్ నామినేషన్ దాఖలు మళ్లీ మొదటికొచ్చింది.