శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 ఆగస్టు 2024 (11:34 IST)

అగ్ని మిస్సైల్ మ్యాన్ ఇకలేరు.. అనారోగ్యంతో కన్నుమూత

RN Agarwal
అగ్ని మిస్సైల్ రూపకర్త ఆర్ఎన్ అగర్వాల్ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ రామ్ నారాయణ్ అగర్వాల్ (ఆర్ఎన్ అగర్వాల్) 84 యేళ్ల వయసులో గురువారం హైదరాబాద్ నగరంలో మృతి చెందారు. చైనాకు ముచ్చెమటలు పట్టిస్తున్న అగ్ని క్షిపణులను తయారు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా, సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలను ఛేదించే క్షిపణులను అభివృద్ధి చేయడంతో ఆయన ఎంతో పేరుగడించారు. అగ్ని క్షిపణి ప్రాజెక్టుకు తొలి డైరెక్టరుగా వ్యవహరించారు. దేశానికి ఆయన చేసిన సేవలకుగాను గత 1990లో పద్మశ్రీ, 2000లో పద్మ భూషణ్ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను సత్కరించింది. 2004లో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అగర్వాల్ సొంతం చేసుకున్నారు. 
 
లాంగ్ రేజ్ క్షిపణులు అభివృద్ధిలో అగర్వాల్ పేరుగడించారు. ప్రఖ్యాత ఏరోస్పేస్ శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు. డీఆర్డీవోతో అగర్వాల్‌కు దశాబ్దాల అనుబంధం ఉంది. 1983లో ప్రారంభమైన అగ్నిక్షిపణి కార్యక్రమానికి అగర్వాల్ నాయకత్వం వహించారు. అగర్వాల్ మృతిపట్ల డీఆర్డీవో శాస్త్రవేత్తలు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఒక మేధావిని కోల్పోయినట్టు తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు. కాగా, అగర్వాల్ ఐఐటీ మద్రాస్, బెంగుళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో విద్యాభ్యాసం చేశారు.