శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 మార్చి 2024 (14:07 IST)

24 గంటల్లో రూ.1.88 కోట్ల నగదు-రూ.87.19 లక్షల లిక్కర్ స్వాధీనం

Money
కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గత 24 గంటల్లో రూ.1.88 కోట్ల నగదు, రూ.87.19 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. కర్ణాటకలో 28 నియోజకవర్గాలకు ఏప్రిల్ 26, మే 7న రెండు దశల్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. 
 
చిత్రదుర్గ పార్లమెంటరీ నియోజకవర్గంలోని హిరియూరులో స్టాటిక్ సర్వైలెన్స్ బృందం రూ.1.44 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అదే నియోజకవర్గంలో చల్లకెరె వద్ద ఎక్సైజ్ శాఖ 14,688 లీటర్ల ఇండియా మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్‌ఎల్)ను స్వాధీనం చేసుకుంది. 
 
ఎంసీసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, పోలీసు అధికారులు రూ.17.66 కోట్ల నగదు, రూ.24.25 కోట్లకుపైగా విలువైన 7.69 లక్షల లీటర్ల మద్యం, 87.04 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. 
 
ఇంకా రూ.75 లక్షలకు పైగా విలువైన వస్తువులు, రూ. 1.27కోట్ల విలువైన బంగారం, రూ. 21.47 లక్షల విలువైన వెండి, రూ. తొమ్మిది లక్షల విలువైన వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు.