ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

భారత ఎన్నికల సంఘం నేషనల్ ఐకాన్‌గా సచిన్ టెండూల్కర్

sachin tendulkar
భారత ఎన్నికల సంఘం (ఈసీ) ప్రచారానికి నేషనల్ ఐకాన్‌గా దిగ్గజ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉభయుల మధ్య బుధవారం అవగాహన ఒప్పందం కుదరనుంది. ఓటర్లు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రక్రియలో పాల్గొని తమ ఓటుహక్కు వినియోగించుకునేలా సచిన్ అవగాహన కల్పించనున్నారు. 
 
ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసీతో కలిసి సచిన్ సంయుక్తంగా కృషి చేసే ఈ ఒప్పందం మూడేళ్లపాటు అమలులో ఉంటుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజలు, యువత ఓటింగ్‌పై నిర్లక్ష్యం చూపుతున్నందున వారిలో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటారు. సచిన్ ప్రచారంతో రాబోయే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల పక్రియలో యువత ఎక్కువగా పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులు అభిప్రాయపడ్డారు. కాగా, గత 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎం.ఎస్.ధోనీ, అమీర్ ఖాన్, మేరీకోమ్ నేషనల్ ఐకాన్స్ వ్యవహరించిన విషయం తెల్సిందే.
 
మరోవైపు, ప్రస్తుతం దేశంలో ఓటర్ల సంఖ్య 94.50 కోట్లకు చేరిందని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. దేశంలో తొలిసారి 1951లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 17.32 కోట్ల ఓట్లు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ ఓటర్ల సంఖ్య ఐదారురెట్లు పెరిగిపోయింది. మొత్తం 140 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో ఈ యేడాది జనవరి ఒకటో తేదీ నాటికి మొత్తం ఓటర్ల సంఖ్య 94,50,25,694కు చేరింది.