ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్(82) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం గురుగ్రామ్‌లోని మేదాంతా ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు అఖిలేశ్ యాదవ్ అధికారికంగా వెల్లడించారు. నేతాజీ ఇకలేరు అంటూ ఆయన ఎస్పీ కార్యకర్తలకు తెలిపారు.
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన గత నెల 22వ తేదీన ఆస్పత్రిలో చేరి అప్పటి నుంచి గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్సపొందుతూ వచ్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఈ నెల 2వ తేదీన ఐసీయు వార్డుకు తరలించారు. అక్కడ లైఫ్ సపోర్టు వ్యవస్థపై చికిత్స అందిస్తూ వచ్చారు. ముఖ్యంగా, శ్వాసపీల్చడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పైగా, ఆయనకు ఎలాంటి మందులు పని చేయలేదు. దీంతో ఆయన సోమవారం ఉదయం కన్నుమూసినట్టు వైద్యులు తెలిపారు.
ములాయం సింగ్ ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయాల్లో సైతం చెరగని ముద్ర వేశారు. నవంబర్ 22, 1939లో జన్మించిన ములాయం మూడుసార్లు యూపీ సీఎంగా పనిచేశారు. కేంద్రంలో రక్షణశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. లోక్‌సభలో మెయిన్‌పురి నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. అంతకుముందు అజమ్‌గఢ్, సంభాల్ నియోజకవర్గాల పార్లమెంటు సభ్యుడిగా కూడా పనిచేశారు.
ములాయం సింగ్ యాదవ్ మొదటిసారిగా 1989లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. 1990 నవంబరులో విపి సింగ్ జాతీయ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత యాదవ్, చంద్రశేఖర్ నాయకత్వంలోని జనతా దళ్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు.
జాతీయ స్థాయిలో చంద్ర శేఖర్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న కాంగ్రెస్.. 1991 ఏప్రిల్‌లో మలాయంసింగ్ ప్రభుత్వానికి కూడా తమ మద్దతును ఉపసంహరించుకుంది. దాంతో యాదవ్ ప్రభుత్వం పడిపోయింది.1991 మధ్యలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఇందులో ములాయం సింగ్ పార్టీ ఓడిపోయి, బీజేపీ అధికారాన్ని దక్కించుకుంది.