శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 19 ఏప్రియల్ 2017 (08:28 IST)

బీజేపీ అండతో గర్జించిన పన్నీర్, వణకిపోయిన పళని, శశికళ కథ కంచికి..!

తమిళనాడు రాజకీయాల్లో సంచలన నిర్ణయం జరిగిపోయింది. దివంగత జయలలిత నెచ్చెలి శశికళ, ఆమె కుటుంబాన్ని అన్నాడీఎంకే రాజకీయాల నుంచి పూర్తిగా బహిష్కరించారు. సాక్షాత్తూ శశికళ నమ్మినబంటు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి నేతృత్వంలో జరిగిన కేబినెట్ సంప్రదింపుల భేటీలో

తమిళనాడు రాజకీయాల్లో సంచలన నిర్ణయం జరిగిపోయింది. దివంగత జయలలిత నెచ్చెలి శశికళ, ఆమె కుటుంబాన్ని అన్నాడీఎంకే రాజకీయాల నుంచి పూర్తిగా బహిష్కరించారు. సాక్షాత్తూ శశికళ నమ్మినబంటు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి నేతృత్వంలో జరిగిన కేబినెట్ సంప్రదింపుల భేటీలో పార్టీల ప్రయోజనాలు, కార్యకర్తల ఆకాంక్షకు అనుగుణంగా శశికళ కుటుంబాన్ని పార్టీనుంచి, ప్రభుత్వం నుంచి వెలివేసినట్లు ఆర్థిక మంత్రి జయకుమార్ ప్రకటించారు. దీంతో పాతికేళ్లుగా జయలలితను అడ్డంపెట్టుకుని మన్నారు గుడి ముఠా సాగించిన భయంకర కుట్రలకు శాశ్వతంగా తెరపడిపోయింది.
 
శశికళ విషయంలో ఏ రకంగా రాజీ పడినా సరే తమిళనాడులో ప్రభుత్వం ఉండదని తిరుగుబాటు నేత పన్నీర్ సెల్వం సీరియస్ వార్నింగ్ ఇవ్వడం పళనిస్వామి మంత్రివర్గం మీద, ఎమ్మల్యేల మీద తీవ్రంగా ప్రభావం చూపింది. సెల్వం గొంతు అంత కాఠిన్యతను పలకడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వత్తాసు ఉండటమే అన్నది స్పష్టమే. ఈ నేపథ్యంలోనే శశికళ, దినకరన్ అరాచకాలతో అంటకాగి ప్రభుత్వాన్న పణంగా పెట్టాలా అనే మీమాంసలో పడిన ముఖ్యమంత్రి, మంత్రులు ఆకస్మిక నిర్ణయంతో మన్నార్ గుడి ముఠాను రాజకీయంగా సమాధి చేసేశారు. 
 
పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి దినకరన్‌ను, ఆయన కుటుంబాన్ని దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకోవడం, పైగా అది పార్టీ శ్రేణులతో పాటు అత్యున్నత స్థాయి నాయకులు, జిల్లా కార్యదర్శులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు తీసుకున్న నిర్ణయమని ఆర్థిక మంత్రి జయకుమార్ స్పష్టం చేయడం, పార్టీ రోజువారీ కార్యకలాపాలను నడిపించడానికి త్వరలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పడం.. శశికళ పేరెత్తకుండా ఆమె కుటుంబాన్ని వెలి వేయడం వంటివి చకచకా జరిగిపోవడం వెనుక పన్నీర్ సెల్వం హెచ్చరిక తీవ్రంగానే పనిచేసిందని సమాచారం. 
 
ఇక ఏమాత్ర తాత్సారం చేసినా మంగళవారమే చెన్నయ్ చేరుకున్న గవర్నర్ విద్యాసాగరరావు ప్రభుత్వ మనుగడకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవడం ఖాయమని వార్తలు రావడం శశికళ అనుయాయులను, నమ్మిన  బంట్లను కూడా బెంబేలెత్తించింది. దీని ఫలితమే మంగళవారం రాత్రి అంతా కలిపి శశికళ కుటుంబాన్ని సాగనంపారు. విలీనం చర్చలకు ‘వెలి’ షరతు పెట్టిన పన్నీర్ సెల్వం చివరకు పంతం నెగ్గించుకున్నారు. 
 
ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నాలు చేశారని, రెండాకుల గుర్తు కోసం ఎన్నికల కమిషన్‌కే లంచం ఇవ్వజూపాడనే ఆరోపణలను ఎదుర్కొంటున్న దినకరన్‌తో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని సీఎం సహా కొందరు సీనియర్‌ మంత్రుల్లో ఆందోళన నెలకొంది. పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం నుంచి పార్టీ విలీనంపై చర్చకు సిద్ధమని ఆహ్వానం అందింది. అయితే, పార్టీ, ప్రభుత్వంపై శశికళ, దినకరన్‌ కుటుంబ పెత్తనం లేకుండా చేయాలని పన్నీర్‌సెల్వం ముందస్తు షరతు విధించారు. 
 
ఎంజీ రామచంద్రన్‌ స్థాపించిన అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నాన్ని దక్కించుకునేందుకు దినకరన్‌తో తెగతెంపులు చేసుకోవాలనే సంకల్పంతో మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి పళనిస్వామి ఇంట్లో 20 మంది మంత్రులు సమావేశమయ్యారు. సుమారు గంటపాటు అనేక అంశాలపై చర్చించిన అనంతరం మంత్రి జయకుమార్‌ మీడియాతో సమావేశం నిర్ణయాలు ప్రకటించారు. దినకరన్, ఆయన కుటుంబీకులతో ఎటువంటి సంబంధం పెట్టుకోరాదని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు జయకుమార్‌ చెప్పారు. ఎలాంటి కారణం చేతనూ ఇకపై వారిని చేరదీసే ప్రసక్తిలేదని ఆయన స్పష్టం చేశారు. 
 
తీవ్ర ఉత్కంఠ భరిత పరిణామాల మధ్య శశికళను పార్టీనుంచే సాగనంపిన నేపథ్యంలో ఇక పన్నీర్ సెల్వం స్థానాన్ని పార్టీలో నిర్ధారించడమే కావలసి ఉంది.