శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 26 జూన్ 2020 (18:52 IST)

బెంగుళూరు జైలు నుంచి రిలీజ్ కానున్న చిన్నమ్మ???

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రియనెచ్చెలి శశికళ నటరాజన్ త్వరలోనే జైలు నుంచి విడుదల కానున్నారనే ప్రచారం తమిళనాట జోరుగా సాగుతోంది. ముఖ్యంగా, ఆగస్టు 14వ తేదీన ఆమె బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలు నుంచి విడుదలవుతారని బీజేపీకి చెందిన సీనియర్ నేత ఒకరు చేసిన వ్యాఖ్యలు ఇపుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. 
 
జయలలిత అక్రమాస్తుల కేసులో ఏ2 ముద్దాయిగా ఉన్న శశికళ ప్రస్తుతం బెంగుళూరు జైలులో శిక్షను అనుభవిస్తున్న విషయం తెల్సిందే. ఈమె ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్‌ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేసే ప్రక్రియలో భాగంగా శశికళను కూడా విడుదల చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, ఈ వార్తలో ఎంత నిజముందోగానీ తమిళనాడు రాజకీయాల్లో మాత్రం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
కాగా, 2016లో ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన కొన్న నెలలకే జయలలిత అనారోగ్యంతో మరణించారు. ఆ తర్వాత శశికళ ముఖ్యమంత్రి అవుతారని అందరూ భావించారు. కానీ, పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో శశికళ సహా ఇరవళసి, సుధాకరన్‌లు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఇద్దరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు శశికళ జైలు నుంచి విడుదలైతే తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయని అంచనా వేస్తున్నారు.