1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 ఆగస్టు 2020 (16:16 IST)

హిందూ ఆలయాన్ని రక్షించిన ముస్లిం యువకులు

దేశ ఐటీ రాజధానిగా ఉన్న బెంగుళూరు నగరంలోని డీజేహళ్లి, కేజీహళ్లి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో మంగళవారం రాత్రి హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో జరిగిన భారీ విధ్వంసం గురించి వివరాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ విధ్వంసకాండ అప్పటికప్పుడు అనుకుని చేసింది కాదని, దీని వెనుక భారీ ప్రణాళిక ఉందని పోలీసులు తేల్చారు. 
 
ఈ నెల 5 నుంచి కుట్రకు ప్రణాళిక వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆందోళనల సమయంలో కొంతమంది గంజాయి తాగి ఉన్నట్లు తేల్చారు. ఈ ఘర్షణల్లో దాదాపు 3000 మంది పాల్గొన్నట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టినట్లు తెలిపారు.
 
అల్లర్ల వెనుక సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్‌డీపీఐ నేత ముజామ్మిల్‌ బాషాను ఏ1గా పేర్కొన్నారు. ఉద్రిక్త పరిస్థితులతో ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీనివాసమూర్తి ఇంటి వద్ద అదనపు భద్రతను మోహరింపజేశారు.
 
ఈ ఘటనపై గవర్నర్‌కు హోంమంత్రి బసవరాజ బొమ్మై వివరణ ఇచ్చారు. అలాగే, సీఎం యడియూరప్పకు డీజీపీ ప్రవీణ్ సూద్ నివేదిక అందజేశారు. బెంగళూరు పోలీసు కమిషనర్ కమల్ పంత్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బెంగళూరులోని పరిస్థితులను సీఎం యడియూరప్ప సమీక్షించారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.
 
మరోవైపు, దేశంలో కొనసాగే మతసామరస్యానికి ప్రతీకగా ఓ ఘటన నిలిచింది. ఓ వైపు ఓ వర్గం వారు చేస్తోన్న భారీ హింసతో కర్ణాటకలోని బెంగళూరులోని డీజే హళ్లి ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. మరోవైపు, ముస్లిం యువకులు మతసామరస్యాన్ని చాటారు.
 
ఆందోళనకారులు అక్కడి హిందూ ఆలయాన్ని కూల్చకుండా ఆ మందిరం చుట్టూ మానవహారంగా నిలబడి అడ్డుకున్నారు. అంతటి ఉద్రిక్తతల మధ్య కూడా ఆ ముస్లిం యువకులు భారతీయ భిన్నత్వంలోని ఏకత్వ విలువను చాటడం పట్ల సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. 
 
ఇందుకు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. భారతీయతలోని గొప్పదనం ఇదేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ నేత శశిథరూర్‌ కూడా స్పందిస్తూ ఆ ముస్లిం యువకులను ప్రశంసించారు. ఒక కమ్యూనిటీలోని కొందరు చేసిన పని కారణంగా ఆ మొత్తం కమ్యూనిటీని నిందించడం సరికాదని, ఈ ఘర్షణలకు కారణమైన వారిని అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.