శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 నవంబరు 2019 (13:42 IST)

శివసేనవి బ్లాక్‌మెయిల్ రాజకీయాలు : బీజేపీ

శివసేన పార్టీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ ఆరోపించింది. పైగా, ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్‌ను ఓ జోకర్‌తో బీజేపీ నేత, మహారాష్ట్ర రాష్ట్ర మంత్రి జైకుమార్ రావల్ పోల్చారు. దీంతో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు మరింత సంక్షోభంలో పడినట్టయింది. 
 
ఇదే అంశంపై జైకుమార్ రావల్ సోమవారం ముంబైలో మాట్లాడుతూ, శివసేనను బ్లాక్ మెయిలింగ్ పార్టీ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్ర అసెంబ్లీకి మరోసారి ఎన్నికలను నిర్వహిస్తే బీజేపీకి మరిన్ని ఎక్కువ సీట్లు వస్తాయని తెలిపారు.
 
మరోవైపు, బీజేపీ అధికార పత్రిక అయిన 'తరుణ్ భారత్' తన ఎడిటోరియల్‌లో శివసేనను ఏకిపారేసింది. శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్‌ను 'ఓ జోకర్' అంటూ ఎద్దేవా చేసింది. ప్రకృతి వైపరీత్యానికి రాష్ట్రంలోని 60 శాతం మంది రైతులు తీవ్రంగా నష్టపోయి, నానా ఇబ్బందులు పడుతుంటే... శివసేనకు చీమ కుట్టినట్టు కూడా లేదని మండిపడింది. 
 
కేవలం అధికార పీఠాన్ని అధిరోహించడమే దాని ఏకైక లక్ష్యంగా కనిపిస్తోందన్నారు. సామాన్యులు, రైతుల కష్టాలను పట్టించుకోని శివసేనను ప్రజలు ఎన్నటికీ మన్నించరని తెలిపింది. శివసేన, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్లే బీజేపీ 105 స్థానాలను గెలుచుకుందని... ఒంటరిగా పోటీ చేసుంటే 70 సీట్ల కంటే ఎక్కువ గెలుచుకోలేకపోయేదంటూ శివసేన చేస్తున్న వ్యాఖ్యలను 'తరుణ్ భారత్' తప్పు బట్టింది. 
 
శివసేనలో ఒక తెలివైన నాయకుడు ఉన్నారని... ఉదయం లేవగానే హిందీ పద్యాలను ట్వీట్ చేయడం, ఆ తర్వాత తప్పుడు వార్తలకు జీవం పోయడమే ఆయన పని అంటూ సంజయ్ రౌత్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేసింది. సంజయ్ రౌత్ శివసేన అధికార పత్రిక 'సామ్నా'కు ఎడిటర్‌గా కూడా వ్యవహరిస్తున్న విషయం గమనార్హం.