శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 నవంబరు 2019 (14:32 IST)

శివసేనకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు : సంజయ్ రౌత్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గత నెల 21వ తేదీన వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో బీజేపీ 105 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దాని మిత్రపక్షమైన శివసేన 56 సీట్లను కైవసం చేసుకుంది. 
 
అయితే, మహారాష్ట్రలో సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలని బీజేపీ ముందు శివసేన డిమాండ్ పెట్టింది. వర్లి నుంచి పోటీ చేసి గెలిచిన ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని శివసేన కోరుతోంది. దీనికి బీజేపీ ససేమిరా అంటోంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. 
 
ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన నౌత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తమకు 170 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారని చెప్పారు. మరో ఐదుగురు కూడా తమకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని దీంతో ఆ సంఖ్య 175కు చేరే అవకాశం లేకపోలేదన్నారు. 
 
ఒకవేళ ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ విఫలమైతే రెండో పెద్ద పార్టీగా శివసేన... ఎన్‌సీపీ, కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముందని ఆ పార్టీ అధికారిక పత్రిక అయిన సామ్నాలో పేర్కొంది. 
 
శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీ సిద్ధాంతాలు వేర్వేరైనా మహారాష్ట్రలో కలిసి పనిచేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని, అవసరమైన ప్రణాళికతో ముందుకు వెళ్తామని చెప్పారు.