సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనకు మద్దతిస్తాం : శరద్ పవార్

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన ముందుకు వస్తే తాము మద్దతిస్తామని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పష్టం చేశారు. అదేసమయంలో బీజేపీ, శివసేనలు ఎవరికి వారు సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం చేస్తున్నాయి. 
 
ఇలాంటి పరిస్థితుల్లో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ చేసిన ప్రకటన కీలకంగా మారింది. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనకు మద్దతిస్తామని ఎన్సీపీ సూచనప్రాయంగా వెల్లడించింది. బీజేపీ తోడ్పాటు లేకుండా ఛత్రపతి శివాజీ పేర్కొన్న తరహాలో ప్రజా ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన ముందుకువస్తే తాము సానుకూలంగా స్పందిస్తామని ఆ పార్టీ అధికార ప్రతినిధి నవాబ్‌ మాలిక్‌ స్పష్టం చేశారు. 
 
మహారాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆ పార్టీ చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే అడుగులు వేస్తే ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. నవంబర్‌ 7 నాటికి నూతన ప్రభుత్వం ఏర్పాటు కాని పక్షంలో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తారని బీజేపీ నేత సుధీర్‌ ముంగతివర్‌ ప్రకటన పట్ల మాలిక్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. 
 
మహారాష్ట్రలో బీజేపీ రాష్ట్రపతి పాలన విధించడాన్ని తాము అనుమతించబోమని, రాష్ట్రానికి ప్రజాస్వామ్య ప్రక్రియలో నూతన దిశను అందిస్తామని స్పష్టం చేశారు. తాము ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని అందించేందుకు సిద్ధమని, శివసేన ఇతర పార్టీలు దీనిపై తమ​ వైఖరిని వెల్లడించాలని కోరారు.