బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 సెప్టెంబరు 2024 (16:45 IST)

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా శివరాజ్ సింగ్ చౌహాన్?

shivraj singh
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడుగా మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ఎన్నికకానున్నట్టు సమాచారం. ఆయనకు బీజేపీ పెద్దలతో పాటు ఆర్ఎస్ఎస్ అండదండలు పూర్తిగా ఉన్నాయి. దీంతో ఆయనకు బీజేపీ పగ్గాలు అప్పగించనున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 
 
పార్టీ అధ్యక్ష పదవికి 65 యేళ్ల శివరాజ్ సింగ్ చౌహాన్ పేరును ఆర్ఎస్ఎస్‌తో పాటు బీజేపీలోని పలు వర్గాలు సమర్థించినట్లు తెలుస్తోంది. ప్రశాంతంగా ఉండే తత్వం, రాజకీయ చతురతకుతోడు అసాధారణ మీడియా మేనేజ్మెంట్ నైపుణ్యాలు ఉన్న ఆయన బలమైన పోటీదారుగా నిలిచారు. మూడు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న శివరాజ్ సింగ్.. క్లిష్టమైన సవాళ్లను సైతం ఎదుర్కోగలనని నిరూపించుకున్నారని, అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న ఇతర నాయకుల్లో ఎవరికీ ఈ లక్షణాలు లేవని ఆరెస్సెస్ వర్గాలు చెబుతున్నాయి. 
 
పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఇప్పటివరకూ చర్చించిన నేతల్లో చౌహాన్ అత్యుత్తమ ఎంపికని, ఆయనకున్న ప్రజాదరణకుతోడు విస్తృతమైన అనుభవంతో పార్టీకి మరింత ప్రయోజనం చేకూరుతుందని బీజేపీ పెద్దలు గట్టిగా నమ్ముతున్నారు. బీజేపీతో పాటు సంఘ్ ఆయనకున్న దశాబ్దాల నాటి అనుబంధం కూడా పరిగణనలోకి తీసుకొనే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాయి. ఆరెస్సెస్‌లో అజాతశత్రువుగా పేరొందిన శివరాజ్‌లో పోరాడేతత్వం, శ్రేణుల్లో ఏకాభిప్రాయాన్ని సాధించే నేర్పు జాతీయ స్థాయిలో బీజేపీని నడిపించే నాయకుడికి ఉండాల్సిన కీలక నైపుణ్యాలని ఆరెస్సెస్ ప్రముఖుడు ఒకరు అభిప్రాయపడ్డారు.