గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శనివారం, 15 జూన్ 2024 (17:15 IST)

అహంకారమే బీజేపీ కొంపముంచింది.. అందుకే 240 సీట్లకు పరిమితమైంది : ఇంద్రేశ్ కుమార్

indresh kumar
అహంకారమే భారతీయ జనతా పార్టీ కొంప ముంచిందని, అందుకే ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ 240 సీట్లకే పరిమితమైందని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఇంద్రేశ్ కుమార్ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రాముడిని విశ్వసించని వారు మాత్రం 234 సీట్లు సంపాదించుకున్నారంటూ ఆయన బీజేపీ నేతలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. నిత్యం శ్రీరాముడిని పూజించి అహంకారం పెంచుకోవడం వల్లే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లకు పరిమితమైందన్నారు. 
 
జైపూర్‌లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఇంద్రేశ్ కుమార్ మాట్లాడుతూ.. శ్రీరాముడిని పూజించి అహంకారం పెంపొందించుకున్న పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో 240 సీట్లకు మాత్రమే పరిమితమైందని, అయినప్పటికీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని గుర్తుచేశారు. శ్రీరాముడిని విశ్వసించని వారు మాత్రం 234 సీట్లు సంపాదించుకున్నారని ఇండియా కూటమిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాముడిని పూజిస్తున్నప్పటికీ అహంకారం వల్లే ఓట్లను, అధికారాన్ని దేవుడు అడ్డుకున్నాడని పేర్కొన్నారు.
 
ఇంద్రేశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ ఘాటుగా స్పందించారు. రాముడు ఎన్డీయేకు అనుకూలంగా తీర్పు ఇచ్చాడన్నారు. అహంకారం అని చెప్పే వారిని అలాగే సంతోషంగా ఉండనివ్వాలని సూచించారు. ఇలా చెప్పేవారు తొలుత వారి గురించి ఆలోచించాలని బదులిచ్చారు.