శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 9 జూన్ 2024 (12:33 IST)

నేడు కొలువుదీరనున్న మోడీ 3.0 సర్కారు : తెలంగాణ నుంచి ఆ ఇద్దరికీ కేబినెట్ బెర్తులు!!

kishan reddy
నరేంద్ర మోడీ సారథ్యంలోని మోడీ 3.0 సర్కారు మరికొన్ని గంటల్లో ఏర్పడనుంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ కొత్త ప్రభుత్వం ఆదివారం రాత్రి 7.15 గంటలకు కొలువుదీరనుంది. ఈ కొత్త ప్రభుత్వంలో మంత్రిపదవులు దక్కించుకునేందుకు పలువురు సీనియర్ ఎంపీలు పోటీపడుతున్నారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతం నుంచి ఇద్దరు సీనియర్ నేతలకు కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కింది. ఆ ఇద్దరు ఎవరో కాదు.. కిషన్ రెడ్డి, బండి సంజయ్. సికింద్రాబాద్ స్థానం నుంచి కిషన్ రెడ్డి గెలుపొందగా, కరీంనగర్ నుంచి బండి సంజయ్ గెలుపొందారు. ఈ ఇద్దరికి మంత్రిపదవులు ఖరారు కావడంతో ఆదివారం ఉదయం ప్రధానమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. దీంతో వారిద్దరూ ఒకే కారులో ప్రధాని నివాసంలో జరిగిన తేనేటి విందుకు హాజరయ్యారు. 
 
ముగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎనిమిది స్థానాలను దక్కించుకున్న విషయం తెల్సిందే. దీంతో మంత్రి పదవులు ఎవరెవరికి దక్కుతాయనే ఆసక్తికర చర్చ జరిగింది. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు డీకే అరుణ, ఈటల రాజేందర్ పేర్లు కూడా ప్రముఖంగా వినిపించాయి. కానీ, ప్రస్తుతం తెలంగాణ రాఖ బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌లను ప్రధాని మోడీ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 
 
కాగా, మరికొన్ని గంటల్లో మోడీ 3.0 సర్కారు కొలువుదీరనుంది. రాష్ట్రపతి భవన్‌లో రాత్రి 7.15 నిమిషాలకు నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఏర్పాట్లు చేసింది. అలాగే, ఢిల్లీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఈ ప్రమాణ స్వీకారం జరిగే పరిసర ప్రాంతాల్లో రెండు రోజుల పాటు నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించారు.