వైద్య విద్యార్థుల పరిశోధన కోసం సీతారం ఏచూరీ భౌతికకాయం దానం!
వైద్య విద్యార్థుల పరిశోధన కోసం కమ్యూనిస్టు దిగ్గజం సీతారం ఏచూరీ భౌతికకాయాన్ని ఆయన కుటుంబ సభ్యులు దానం చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన సీతారాం ఏచూరీ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన విషయం తెల్సిందే. దీంతో ఏచూరీ భౌతికకాయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఎయిమ్స్ ఆస్పత్రికి దానం చేశారు. వైద్య విద్యను అభ్యసించే విద్యార్థుల బోధన, రీసెర్స్‌లో ఏచూరీ భౌతికకాయాన్ని ఉపయోగించుకోవాలని కుటుంబ సభ్యులు ఎయిమ్స్‌ను కోరారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఎయిమ్స్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
మరోవైపు, సీతారాం ఏచూరీ మృతిపై టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లు తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో ఏచూరీ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు తెలిపారు. అట్టడుగు వర్గాల ప్రజలతో సీతారాం ఏచూరీకి మంచి అనుబంధం ఉందని తెలిపారు. దేశ రాజకీయాల్లో ఆయన అత్యంత గౌరవనీయ వ్యక్తి అని వారు అభివర్ణించారు. సీతారాం ఏచూరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారని వివరించారు.