ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 జులై 2021 (15:10 IST)

వీర్యం తీసిన కాసేపటికే భర్త మృతి: అలా ఆ భార్య పోరాటం ముగిసింది..

కరోనాతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తి భార్య ఇటీవల గుజరాత్ హైకోర్టును ఆశ్రయించింది. చావుబతుకుల్లో ఉన్న తన భర్త వీర్యం ఇప్పించాలని, అతడి ద్వారా ఐవీఎఫ్‌ పద్ధతిలో ఒక బిడ్డకు తల్లి అయ్యే అవకాశం కల్పించాలని న్యాయస్థానాన్ని కోరింది. 
 
ఈ విషయంలో తన అత్త, మామలు కూడా ఆమెకు అండగా నిలిచారు. ఆమె పిటిషన్​పై సానుకూలంగా స్పందించిన గుజరాత్​ హైకోర్టు ప్రక్రియ పూర్తి చేయాల్సిందిగా సదరు ఆస్పత్రి వర్గాలను ఆదేశించింది. కోర్డు ఆదేశాల ప్రకారం, చావు బతుకుల్లో ఉన్న వ్యక్తి వీర్యాన్ని సేకరించారు డాక్టర్లు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే అతడు మరణించాడు.  
 
వివరాల్లోకి వెళితే.. గుజరాత్​ వడోదరకు చెందిన 32 ఏళ్ల వ్యక్తి గత మూడు నెలల క్రితం కరోనా బారినపడి స్టెర్లింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి 29 ఏళ్ల భార్య ఉంది. ఈ దంపతులకు పిల్లలు లేరు. జూలై 20న భర్త పరిస్థితి విషమించింది. 24 గంటలకు మించి అతడు బతికే అవకాశం లేదని డాక్టర్లు కుటుంబ సభ్యులకు చెప్పారు.
 
దీంతో ఓవైపు భర్తను కోల్పోతున్న బాధ, మరోవైపు అతడి ప్రతిరూపాన్నైనా చూసుకోవాలనే ఆశ భార్యను కోర్టు మెట్లు ఎక్కేలా చేసింది. జూలై 20న ఆమె గుజరాత్​ హైకోర్టులో ఎమర్జెన్సీ పిటిషన్​ దాఖలు చేసింది. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (ఎఆర్​టి) ద్వారా తన భర్త వీర్యాన్ని (స్పెర్మ్​) సేకరించి, భద్రపరిచేలా ఆసుపత్రి వర్గాలకు ఆదేశాలివ్వాలని పిటిషన్​లో కోరింది.
 
ఆమె పిటిషన్​పై సానుకూలంగా స్పందించిన కోర్టు అందుకు తగిన ఆదేశాలు జారీ చేసింది. ఆ పేషెంట్​ నుంచి వైద్య నిపుణులు వీర్యాన్ని సేకరించి, భద్రపరచాలని సదరు ఆసుపత్రి వర్గాలను ఆదేశించింది. కోర్డు ఆదేశాల మేరకు స్టెర్లింగ్ ఆసుపత్రి డాక్టర్లు రోగి వీర్యాన్ని.. టెస్టిక్యులర్ స్పెర్మ్ ఎక్స్‌ట్రాక్షన్ పద్ధతి ద్వారా సేకరించి ఐవీఎఫ్ ల్యాబ్‌లో భద్రపరిచారు. ఈ ప్రక్రియ ముగిసిన కొద్ది గంటల్లోనే గురువారం బాధితుడు కన్నుమూశాడు.