బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 జూన్ 2023 (15:04 IST)

సీఎం మార్నింగ్ వాక్ - బైకుపై దూసుకొచ్చిన వ్యక్తులు...

nitish kumar
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు ప్రాణగండం తప్పింది. ఆయన మార్నింగ్ వాక్ చేస్తుండగా కొందరు వ్యక్తులు ఆయనకు అత్యంత సమీపానికి వచ్చారు. ముఖ్యమంత్రి భద్రతా వలయాన్ని ఛేదించుకుని దాదాపుగా ఢీకొట్టినంత పని చేశారు. దీంతో అప్రమత్తమైన సీఎం వెంటనే  ఫుట్‌పాత్‌పైకి వెళ్లిపోయారు. గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది తీవ్ర భద్రతా వైఫలం కావడం గమనార్హం. 
 
గురువారం ఉదయం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వాకింగ్‌ చేసేందుకు తన ఇంటి నుంచి సర్క్యులర్‌ రోడ్డుకు వెళ్లారు. దీంతో ఆ మార్గంలో పోలీసులు భద్రతను ఏర్పాటుచేశారు. అయితే, ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు రెండు బైక్‌లపై ఆ మార్గంలోకి వచ్చారు. భద్రత వలయాన్ని దాటుకుని సీఎం నడుస్తున్న వైపు వేగంగా దూసుకొచ్చారు. వీరిని గమనించిన నీతీశ్ వెంటనే అప్రమత్తమై రోడ్డు పక్కనే ఉన్న ఫుట్‌పాత్‌పైకి ఎక్కారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
 
వెంటనే భద్రతా సిబ్బంది బైకర్లను వెంబడించి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఘటనాస్థలంలో సీసీటీవీ దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇది పొరబాటున జరిగిందా లేదా దీని వెనుక ఇంకేదైనా ఉద్దేశం ఉందా?అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. 
 
ఈ ఘటన అనంతరం స్పెషల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎస్‌ఎస్‌జీ) విభాగం కమాండెంట్‌, పాట్నా ఎస్‌ఎస్పీని నీతీశ్‌ తన ఇంటికి పిలిపించి సమావేశమయ్యారు. ఘటన జరిగిన సర్క్యులర్‌ రోడ్డులో మాజీ సీఎం రబ్రీ దేవి సహా పలువురు రాజకీయ నాయకుల నివాసాలు కూడా ఉండటం గమనార్హం.