సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 మే 2021 (15:28 IST)

కరోనా వేళ సుప్రీం కీలక ఆదేశాలు.. అవసరమైతేనే ఆ పని చేయండి..

కరోనా వేళ సుప్రీంకోర్టు శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏడేళ్లలోపు జైలు శిక్ష పడే నేరాల విషయంలో నిందితులను అవసరమైతేనే అరెస్ట్ చేయాలని స్పష్టం చేసింది. ఖైదీలందరికీ సరైన వైద్య సదుపాయాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించింది. 
 
జైళ్లలో కరోనా వ్యాప్తిని అదుపులో ఉంచడానికి తరచూ ఖైదీలు, జైలు అధికారులకు టెస్టులు నిర్వహించాలని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఖైదీలకు వైరస్ సోకకుండా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా జైళ్లలో 4 లక్షలకుపైగా ఖైదీలు ఉన్నారు. కొన్ని జైళ్లలో సామర్థ్యానికి మించి ఉన్నట్లు కూడా కోర్టు చెప్పింది.
 
కరోనా బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్న ఖైదీలను గుర్తించి, వెంటనే రిలీజ్ చేసేలా చూడాలని రాష్ట్రాలు, యూటీలు ఏర్పాటు చేసిన అత్యున్నత కమిటీలకు చెప్పింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా జైళ్లలో రద్దీని తగ్గించే ఉద్దేశంతో అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
 
ఇప్పటికే పెరోల్‌పై ఉన్న వాళ్లకు మరో 90 రోజులు పొడిగించాలనీ ఆదేశించింది. గతేడాది మార్చి 23న కరోనా నేపథ్యంలోనే తాత్కాలిక బెయిలు ఖైదీలు, పెరోల్‌పై ఉన్న వాళ్లను, ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే నేరాల్లో విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలను రిలీజ్ చేసే అంశాన్ని పరిశీలించడానికి కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు, యూటీలను కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.