గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 మే 2022 (16:15 IST)

ప్రకటించిన తేదీల్లోనే పీజీ నీట్ పరీక్ష - తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

supreme court
దేశంలోని పీజీ వైద్య కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షలను వాయిదా వేసే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొందరు విద్యార్థుల కోసం ఎక్కువ మంది విద్యార్థులు నష్టం కలిగించేలా ఆదేశించలేమని పేర్కొంది. వాయిదా వేస్తే ఇప్పటికే పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు నష్టపోతారని వ్యాఖ్యానించింది. 
 
పరీక్ష కోసం దాదాపు 2.06 లక్షల మందికి పైగా విద్యార్థులు సన్నద్ధమవుతున్నారని, ఇలాంటి సందర్భంలో పరీక్ష వాయిదావేసి వారికి నష్టం చేకూర్చలేమని పేర్కొంది. అలా చేయడం వల్ల ఆస్పత్రుల్లో వైద్యుల కొరత వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడింది. 
 
పీజీ నీట్‌ను వాయిదా వేయాలని పేర్కొంటూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. నీట్ పీజీతో పాటు ఏ యేడాది కౌన్సెలింగ్ తేదీలు క్లాష్ అవుతున్నాయని, అందుకే వాయిదా వేయాలని కోరుతున్నామని పిటిషనర్ల తరపు అడ్వకేట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, సుప్రీంకోర్టు మాత్రం అందుకు నిరాకరించింది. 
 
ఇప్పటికే అకడమిక్ షెడ్యూల్ నాలుగు నెలలు ఆలస్యమైందని, కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకని నీట్ 2022-23ను ఆలస్యంగా ప్రకటించారని ధర్మాసనం పేర్కొంది. పీజీ నీట్‌ను వాయిదా వేయాలని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేసిన విద్యార్థులు కూడా 2021 నీట్ పీజీ కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారని, వారు నీట్ 2022 రాయకుండా ఎవరూ అడ్డుకోలేదని ధర్మాసనం గుర్తుచేసింది.