సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 ఆగస్టు 2020 (20:50 IST)

లాక్ డౌన్ వల్లే ఇదంతా.. మారటోరియం రుణాలపై వడ్డీ వసూలు చేస్తారా?: సుప్రీం సీరియస్

కరోనా వైరస్ దేశంలో విజృంభిస్తున్న తరుణంలో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రక్రియ ముగిసి.. అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతోంది. అయినా వాహన రాకపోకలు ఆంక్షలతో కూడిన అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ ఆరుమాసాల మారటోరియం వ్యవధిలో రుణాలపై వడ్డీ వసూలు చేసే విషయంలో కేంద్రం తీరును తప్పుబడుతూ దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. 
 
కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో... మార్చి నెల నుంచి ఆగస్టు నెల వరకు రుణ చెల్లింపుదారులకు ఆర్బీఐ ఆరు మాసాల మారటోరియం వసతి కల్పించిన సంగతి విదితమే. కానీ మారటోరియం వ్యవధిలోనూ రుణాలపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని ఇప్పటికే ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆ మేరకు మారటోరియం విషయంలో బ్యాంకులు తమ రుణ చెల్లింపుదారులకు క్లారిటీ ఇచ్చాయి.
 
అయితే మారటోరియం వ్యవధిలో రుణాలపై వడ్డీ వసూలు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ విషయంలో కేంద్రం తీరు పట్ల జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం కాస్త అసహనం వ్యక్తం చేసింది.
 
మారటోరియంపై వడ్డీ విషయంలో ఆర్బీఐ పేరు చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నించొద్దంటూ కేంద్రానికి ధర్మాసనం చురకలంటించింది. ఎప్పుడూ వ్యాపార ధోరణితోనే కాకుండా...ప్రజల ఇబ్బందులను కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది. మారటోరియం ప్రయోజనాలు ప్రజలకు దక్కేలా చూపాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని.. ఈ నేపథ్యంలో మారటోరియంపై వడ్డీ మాఫీ చేయాలని వస్తున్న అభ్యర్థనల విషయంలోనూ కేంద్రమే ఓ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఇంకా సెప్టెంబర్ 1లోపు కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందన తెలియజేయాలని ఆదేశించింది. 
 
మారటోరియం వ్యవధిలో రుణాలపై బ్యాంకులు వడ్డీని మాఫీ చేస్తాయని రుణ చెల్లింపుదారులు ఆశలు పెట్టుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ విషయంలో మరో వారం రోజుల్లో కేంద్రం స్పష్టత ఇవ్వనుండటం రుణ చెల్లింపుదారుల్లో ఆసక్తిరేపుతోంది.