సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జేఎస్కే
Last Updated : సోమవారం, 5 జులై 2021 (21:54 IST)

ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66ఏని ర‌ద్దు.. సుప్రీం సీరియస్.. కేంద్రానికి నోటీసులు

ఎపుడో ఆరేళ్ల క్రితం సుప్రీంకోర్టు ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66ఏ ని ర‌ద్దు చేసింది. ఇంకా దేశవ్యాప్తంగా పలు చోట్ల అదే సెక్ష‌న్ పై కేసులు నమోదవుతుండటంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చాలా దారుణమైన పరిణామమని అభివర్ణించింది. దీనిపై సమాధానమివ్వాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
 
ఓ కేసు విచారణ సందర్భంగా ఐటీ చట్టంలో సెక్షన్‌ 66ఏను రద్దు చేస్తున్నట్లు 2015 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తమ పోలీసు సిబ్బందికి సమాచారమివ్వాలని 2019లోనే ఆదేశాలు జారీ చేసింది. 
 
అయినప్పటికీ ఇంకా పలు చోట్ల పోలీసులు సెక్షన్‌ 66ఏ కింద కేసులు నమోదు చేస్తుండటంపై, పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ అనే ఎన్జీవో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ సెక్షన్‌ కింద గత ఆరేళ్లలో దేశవ్యాప్తంగా వెయ్యికి పైనే కేసులు నమోదయ్యాయని, దీనిపై సత్వరమే చర్యలు తీసుకోవాలని ఎన్జీవో అభ్యర్థించింది.
 
 జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 
 
‘‘ఇది చాలా దిగ్భ్రాంతికరం. దారుణమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎపుడో ర‌ద్దు చేసిన ఐ.టి. సెక్ష‌న్ తో ఇపుడు కేసులు న‌మోదు చేయ‌డం ఏమిట‌ని ’’ ప్ర‌శ్నించింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
 
సోషల్ మీడియా వేదికల్లో చట్టవిరుద్ధ, ప్రమాదకర కంటెంట్‌ను పోస్ట్‌ చేసిన వారిని సెక్షన్‌ 66ఏ కింద అరెస్టు చేసేందుకు వీలుండేది. 
 
ఈ సెక్షన్‌ ప్రకారం నిందితులకు మూడేళ్ల వరకు జైలుశిక్ష విధించొచ్చు. అయితే పలు రాష్ట్రాల్లో ఈ సెక్షన్‌ను పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. 2015లో దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆ విచారణ సందర్భంగా సెక్షన్‌ 66ఏను రద్దు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఇపుడు కూడా అదే కేసులు దేశ‌వ్యాప్తంగా న‌మోదు చేస్తుండ‌టంపై సుప్రీం సీరియ‌స్ అయింది.