మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 18 జులై 2018 (12:27 IST)

తల్లిగర్భం నుంచి పిండాన్ని తొలగించినా హత్య చేసినట్టే : సుప్రీంకోర్టు

గర్భస్రావంపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కీలక రూలింగ్‌ను వెలువరించింది. ఆరోగ్యంగా ఉన్న పిండానికి గర్భస్రావం చేయడమంటే హత్యతో సమానమని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా, తన 25 వారాల(ఏడో నెల) గర

గర్భస్రావంపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కీలక రూలింగ్‌ను వెలువరించింది. ఆరోగ్యంగా ఉన్న పిండానికి గర్భస్రావం చేయడమంటే హత్యతో సమానమని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా, తన 25 వారాల(ఏడో నెల) గర్భాన్ని తొలగించుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ 20 ఏళ్ల యువతి చేసిన వినతిని తిరస్కరించింది.
 
ఈ తరహా గర్భస్రావం వల్ల తల్లి ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేకపోయినా ఆరోగ్యకరమైన పిండాన్ని తల్లి గర్భం నుంచి తొలగించడం అంటే హత్యతో సమానమని పేర్కొంది. తాను మూర్ఛ రోగంతో బాధ పడుతున్నానని, గృహహింస కారణంగా భర్త నుంచి విడిపోతున్నానని, అవాంఛిత గర్భాన్ని కొనసాగిస్తే.. తీవ్ర మానసికవేదనను అనుభవించాల్సి ఉంటుందని, గర్భస్రావానికి అనుమతించాలని ముంబై యువతి తొలుత బోంబే హైకోర్టును ఆశ్రయించింది. ఆమె వినతిని ముంబై కోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 
 
భారతీయ చట్టాల ప్రకారం.. తల్లి ప్రాణాలకు తీవ్ర ముప్పు ఉన్నప్పుడు, బిడ్డ పుడితే తీవ్ర శారీరక, మానసిక వైకల్యాలు ఎదురవుతాయని స్పష్టమైనప్పుడు మాత్రమే 20 వారాలు మించి వయసున్న పిండాన్ని తొలగించవచ్చు. ఈ కేసులో గర్భాన్ని కొనసాగించినా తల్లికి భౌతికంగా ఎటువంటి ముప్పు లేదని సుప్రీంస్పష్టం చేసింది. అయితే, బిడ్డ కంటే తల్లి హక్కులు, ఆరోగ్యానికే పెద్దపీట వేస్తారని, ఇక్కడ తల్లి మానసిక ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పిటిషనర్‌ కోరారు. కానీ, సుప్రీంకోర్టు ఆ వాదనలతో ఏకీభవించకుండా పిటిషన్‌ను కొట్టివేసింది.