శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 ఏప్రియల్ 2021 (09:17 IST)

రాజకీయాల కోసం.. సినిమాలను కూడా వదిలేస్తా: కమల్ హాసన్

రాజకీయాల కోసం.. సినిమాలను కూడా వదిలేసేందుకు సిద్ధంగా వున్నానని ప్రముఖ నటుడు, 'మక్కల్‌ నీధి మయం' అధినేత కమలహాసన్‌ స్పష్టం చేశారు. తమిళనాడులో ఏప్రిల్‌ 6న 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే దఫాలో ఎన్నికలను నిర్వహించనున్నారు. 'మక్కల్‌ నీధి మయం' 154 స్థానాల్లో పోటీ చేస్తుండగా, దాని మిత్రపక్షాలైన ఐజెకె, ఎఐఎస్‌ఎంకె లు చెరో 40 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.
 
ఆదివారంతో తమిళనాట ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో.. కమలహాసన్‌ మీడియాతో మాట్లాడుతూ.. జీవితాన్ని ప్రజాసేవకు అంకితమిస్తానన్నారు. రాజకీయాల్లో తన ప్రవేశం చారిత్రాత్మకమైందన్నారు. తాను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజి.రామచంద్రన్‌ ఆదర్శాలను ప్రచారం చేయడానికి, ప్రజలకు సేవ చేసే విధానాన్ని తెలిపేందుకు అనేక సినిమాల్లో రాజకీయ నాయకుడి పాత్రలు వేశానని వివరించారు. 
 
ఎన్నికల ప్రచారం సందర్భంగా.. తాను చేసిన ఖర్చులను ఎన్నికల కమిషన్‌కు సమర్పించానని, తన ఖర్చులను చూసి ఎన్నికల అధికారులు ప్రశంసించారని తెలిపారు. ఈ మీడియా సమావేశానికి కమల్‌ హాసన్‌తోపాటు తమిళ సినీ ప్రముఖులు రాధిక, శరత్‌కుమార్‌, సుహాసిని, మణిరత్నం హాజరయ్యారు.
 
చాలామంది సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చారని, కానీ వారు తిరిగి సినిమాల్లోకి వెళ్లారని, తనకు అలాంటి ఆలోచన లేదని చెప్పారు. రాజకీయ జీవితానికి అడ్డుగా వస్తుందనుకుంటే తాను సినిమాని సైతం వదిలేస్తానని కమల్‌ స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయడమే ప్రస్తుతం తన ముందున్న లక్ష్యమన్నారు. వివిధ పార్టీల నేతల నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు కాని... వారెవరు అనే విషయాన్ని మాత్రం కమల్‌ హాసన్‌ వెల్లడించలేదు.