ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 ఏప్రియల్ 2022 (13:13 IST)

ఏపీ తరహాలో తమిళనాడులో గ్రామ సచివాలయాలు.. స్టాలిన్ ప్రకటన

దేశంలోనే మొదటిసారిగా గ్రామ సచివాలయాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. 2019 ఎన్నికల్లో విజయం సాధించి, తొలిసారి అధికారంలోకి వచ్చిన జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ.. అదే ఏడాది అక్టోబరు 2 నుంచి గ్రామ సచివాలయాలకు శ్రీకారం చుట్టింది. 
 
ఇదే తరహాలో తమిళనాడులోనూ గ్రామ సచివాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అసెంబ్లీ వేదికగా శుక్రవారం ఓ ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగానే తమిళనాడులోనూ గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నట్లు స్టాలిన్ ప్రకటించారు.  ఈ ఏడాది 600 గ్రామ సచివాలయాలను ఏర్పాటుచేయనున్నట్టు స్టాలిన్ తెలిపారు. 
 
అన్ని సౌకర్యాలతో గ్రామ సచివాలయాలను నిర్మిస్తామని తమిళనాడు సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల్లో సమావేశ మందిరంతో సహా అన్ని సౌకర్యాలు ఉంటాయని, ఒక్కొక్కటి రూ.40 లక్షల అంచనాతో నిర్మించనున్నట్టు వెల్లడించారు.