సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (14:44 IST)

కేంద్రంతో చర్చలు విఫలం - రైతులపై భాష్పవాయు ప్రయోగం.. ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత

farmers rally
తమ డిమాండ్ల పరిష్కారం కోసం రైతులు చేపట్టిన ఆందోళన మరోమారు ఉద్రిక్తతకు దారితీసింది. కేంద్ర మంత్రులు, రైతు సంఘాల ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి. దీంతో రైతులు బుధవారం మళ్లీ ఆందోళనబాట పట్టారు. ఈ క్రమంలో పార్లమెంట్ ముందు ఆందోళన చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఢిల్లీ వీధుల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో రైతులు ప్రతిఘటించారు. దీంతో రైతులపై పోలీసులు మరోమారు భాష్పవాయును ప్రయోగించారు. 
 
కాగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు పలు డిమాండ్లపై రైతులు ఆందోళన చేస్తున్నారు. వీరి సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఐదేళ్ల కాంట్రాక్టును రైతులు తిరస్కరించి, బుధవారం మరోమారు నిరసనలు చేపట్టారు. ఢిల్లీ సరిహద్దుల దగ్గర ఇప్పటికే ఉన్నవారికి తోడు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు దేశ రాజధానికి తరలివెళుతున్నారు. పార్లమెంట్ వద్దకు చేరుకుని నిరసన తెలపాలని భావిస్తున్నారు. 
 
అయితే, రైతులను ఢిల్లీ సరిహద్దుల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే పెట్టిన ముళ్ల కంచెలు, బారికేడ్ల సాయంతో రైతులు ముందుకు రాకుండా అడ్డుపడుతున్నారు. ట్రాక్టర్ల సాయంతో బారికేడ్లను తొలగించేందుకు రైతులు ప్రయత్నించగా.. టియర్ గ్యాస్ ప్రయోగించినట్లు పోలీసులు తెలిపారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతామని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదని, తమపై టియర్ గ్యాస్ ప్రయోగించారని రైతులు చెబుతున్నారు. శాంతియుత ప్రదర్శనకూ అనుమతివ్వకపోవడంపై వారు మండిపడుతున్నారు.
 
ఆదివారం రాత్రి జరిగిన చర్చలలో ఐదేళ్ల కాంట్రాక్టుతో పప్పు ధాన్యాలు, పత్తి సహా పలు పంటలను కొనుగోలు చేస్తామని, ఈ బాధ్యతను సహకార సంఘాలకు అప్పగిస్తామని కేంద్రం చేసిన ప్రతిపాదనను రైతు సంఘాల నేతలు తిరస్కరించారు. సోమవారం రాత్రి వరకు కేంద్రం ప్రతిపాదనపై చర్చించిన నేతలు.. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన అసంబద్ధంగా ఉందని, దీనికి తాము అంగీకరించబోమన తేల్చిచెప్పారు. అన్ని పంటలను కనీస మద్దతు ధరకు కొనాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. 
 
తమ డిమాండ్లను సాధించుకునే వరకూ ఢిల్లీ బార్డర్ల నుంచి తిరిగి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. బార్డర్లలో నే ఉంటూ ఢిల్లీలోకి ఎంటరయ్యేందుకు ప్రయత్నిస్తూనే ఉంటామని చెప్పారు. మరింతమంది రైతులతో కలిసి ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ క్రమంలోనే బుధవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముందా ఐదో దఫా చర్చలకు రావాలంటూ రైతు సంఘాల నేతలకు పిలుపునిచ్చారు.