బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 ఆగస్టు 2020 (17:32 IST)

కేంద్రం హోం మంత్రి అమిత్ షాకు కరోనా!!

దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఫలితంగా ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఈ వైరస్ సోకింది. ఆయనకు వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 
 
కరోనాకు సంబంధించిన ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో, కరోనా పరీక్ష చేయించుకున్నానని, దాంట్లో పాజిటివ్ వచ్చిందని తెలిపారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, అయితే, డాక్టర్ల సలహా మేరకు ఆసుపత్రిలో చేరానని పేర్కొన్నారు. గత కొన్నిరోజులుగా తనను కలిసినవాళ్లందరూ దయచేసి ఐసోలేషన్ లో ఉండాలని అమిత్ షా సూచించారు.
 
మరోవైపు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. సోనియా గత గురువారం ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. మూడు రోజులుగా ఆసుపత్రిలోనే ఉన్న సోనియా ఆదివారం తన నివాసానికి వెళ్లారు. 
 
సోనియా సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆసుపత్రికి వచ్చారని గంగారామ్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ డీఎస్ రాణా తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు ఓ బులెటిన్ వెలువరించాయి.