మహారాష్ట్రలో అరుదైన సంఘటన.. పులికి కృత్రిమ అవయవం
పులికి కృత్రిమ అవయవాన్ని అమర్చిన అరుదైన సంఘటన మహారాష్ట్రలో జరిగింది. నాగపూర్, చంద్రాపూర్ జిల్లా తాడోబా అంథేరి పులుల అభయారణ్యంలో 2012 ఏప్రిల్ 26వ తేదీన ఓ పులి వేటగాళ్లు ఏర్పాటుచేసిన వలలో చిక్కి ఎడమ కాలు కోల్పోయింది.
విషయం తెలిసిన మహారాష్ట్ర పశుసంవర్థక శాఖ డాక్టర్ల టీమ్.. పులికి వెంటనే అభయారణ్యంలో ట్రీట్ మెంట్ చేశారు. కానీ.. కాలు విరగడంతో సంవత్సరాలుగా నడవలేని స్థితిలో బాధపడుతుంది.
దీంతో పులి బాధను అర్థం చేసుకున్న పశుసంవర్థక శాఖ.. ఈ విషయాన్ని వన్యప్రాణి పరిశోధన సంస్థకు తెలిపింది. స్పందించిన వన్యప్రాణి పరిశోధన నిపుణులు.. మత్స్యవిభాగ సైన్సు యూనివర్శిటీ, శిక్షణ కేంద్రం, ఐఐటీ బాంబే నిపుణులతో కలిసి ఎడమకాలు కోల్పోయిన పులికి సర్జరీ చేశారు.
గోరేవాడ పునరావాస కేంద్రంలో పులికి అరుదైన సర్జరీ చేసి కృత్రిమ అవయవాన్ని అమర్చారు. ఈ సర్జరీలో అటవీ అభివృద్ధి సంస్థ అధకారులు కూడా పాల్గొన్నారు. గతంలో కుక్కలు, ఏనుగులకు కృత్రిమ అవయవాలు ఏర్పాటు చేశారు.
ప్రపంచంలోనే మొదటిసారి పులికి కృత్రిమ కాలు అమర్చిన ఘటన మహారాష్ట్ర పశుసంవర్థక శాఖ డాక్టర్ల బృందానికి దక్కిందని తెలిపారు వన్యప్రాణి పరిశోధన నిపుణులు. 8 సంవత్సరాలుగా బాధపడుతున్న పులికి సర్జరీ చేయడంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని తెలిపారు.