శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 1 సెప్టెంబరు 2021 (09:19 IST)

రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా తెలుగు వ్యక్తి

రాజ్యసభ నూతన సెక్రటరీ జనరల్‌గా తెలుగు వ్యక్తి నియమితులయ్యారు. 2018 నుంచి రాజ్యసభ సచివాలయంలో కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న డాక్టర్‌ పరాశరం పట్టాభి కేశవ రామాచార్యులును సభ అత్యున్నత స్థానంలో నియమిస్తూ రాజ్యసభ ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు ఉత్తర్వులు జారీచేశారు.

నాలుగేళ్లుగా ఈ స్థానంలో ఉన్న రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి దేశ్‌దీపక్‌ వర్మ పదవీ విరమణ చేయడంతో రామాచార్యులను నియమించారు. రాజ్యసభ సచివాలయంలో పనిచేసే ఉద్యోగి సెక్రటరీ జనరల్‌ పదవి చేపట్టడం గత 70 ఏళ్లలో ఇదే తొలిసారి. లోక్‌సభ ఉద్యోగులు 9 మంది ఈ అత్యున్నత స్థానానికి చేరినా, రాజ్యసభలో మాత్రం ఇదే ప్రథమం. 2017లో ఏపీ అసెంబ్లీ ప్రత్యేక కార్యదర్శిగానూ రామాచార్యులు సేవలందించారు.

1958 మార్చి 20న కృష్ణా జిల్లాలోని పెనమలూరు మండలం, వేల్పూరు గ్రామంలో జన్మించిన రామాచార్యులు... 40 ఏళ్లుగా పార్లమెంటులో వివిధ హోదాల్లో పనిచేశారు. 1982 ఫిబ్రవరిలో తొలుత అసిస్టెంట్‌ హోదాలో ఏడాదిపాటు లోక్‌సభలో పనిచేశారు. తర్వాత 1983 మేలో రాజ్యసభ సెక్రటేరియట్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌ హోదాలో చేరారు. డిగ్రీ వరకు విజయవాడలోనే విద్యాభ్యాసం చేశారు.

తిరుపతిలో రాజనీతిశాస్త్రంలో ఎంఏ చదివారు. పార్లమెంటులో ఉద్యోగం చేస్తూనే దిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసించారు. ‘భారత పార్లమెంటు, అమెరికా కాంగ్రెస్‌లో కమిటీల వ్యవస్థ, రెండింటి మధ్య సారూప్యత’పై చేసిన పరిశోధనకు 2005లో దిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ ప్రదానం చేసింది.