బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 మే 2024 (14:18 IST)

ఎయిమ్స్ ఎమర్జెన్సీ వార్డులోకి దూసుకొచ్చిన పోలీసు వాహనం.. ఎలా.. ఎందుకు?

police vehicle
దేశంలోనే అత్యున్నతమైన వైద్యశాలలుగా పేరొందిన ఎయిమ్స్ ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులోకి ఓ పోలీసు వాహనం దూసుకొచ్చింది. ఇలా పోలీసు వాహనం రావడానికి కారణం లేకపోలేదు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని అరెస్టు చేసేందుకు పోలీసులు తమ వాహనాన్ని ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకొచ్చారు. ఈ ఘటన ఎయిమ్స్ రిషికేశ్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయ. ఈ దృశ్యాలు సైతం యాభన్ సన్నివేశాన్ని తలపించాయి. ఇంతకీ అక్కడ ఏం జరిగిందో పరిశీలిస్తే, 
 
సర్జరీ యూనిట్‌ విధుల్లో ఉన్న సమయంలో నర్సింగ్ ఆఫీసర్ తనను లైంగికంగా వేధించారంటూ రెండు రోజుల క్రితం ఒక జూనియర్ డాక్టర్ ఆరోపించారు. తనకు అసభ్యకర సందేశాలు పంపించినట్టు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఇతర వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని తొలగించాలంటూ వారు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో నర్సింగ్ ఆఫీసర్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు రాగా, బయట ఆందోళన చేస్తున్న సిబ్బందిని చూసి తమ వాహనంతో నేరుగా ఎమర్జెన్సీ వార్డుకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
 
పోలీసు వాహనం లోపలికి వెళుతున్న వీడియోలో బెడ్లపై పేషెంట్లు కనిపించారు. ఎస్.యూ.వి. వాహనం వస్తుండగా, కొందరు భద్రతీ సిబ్బంది అది వెళ్ళడానికి దారిని సిద్ధం చేశఆరు. అలాగే, నిందితుడిని అరెస్టు చేసినపుడు పోలీసులు అక్కడి కొందరు వైద్యులను అదుపుచేయడం దృశ్యాల్లో కనిపిస్తుంది. మరోవైపు, ఈ ఘటన నేపథ్యంలో ఎయిమ్స్ యాజమాన్యం అతడిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆ శిక్ష సరిపోదని, ఆయనను తక్షణం తొలగించాలని డిమాండ్లు వస్తున్నాయి.