1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 మే 2024 (09:52 IST)

జస్టిస్ చెప్తుంటే పట్టించుకోరా అంటూ బుకాయింపు... కేటుగాడిని బొక్కలో వేసిన పోలీసులు..

arrest
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి సోదరి పేరుతో మోసానికి పాల్పపడిన ఓ కేటుగాడిని పోలీసులు జైలుకు పంపించారు. ఆడ, మగ గొంతుతో మాట్లాడుతూ పోలీసులతో పాటు బాధితులను కూడా బెదిరిస్తూ మోసాలకు పాల్పడుతూ వచ్చిన వ్యక్తిని అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్లపెనుమర్రుకి చెందిన గొట్టిపాటి సందీప్‌(23) డిప్లొమో చేశాడు. కేపీహెచ్‌బీకి చెందిన ఓ మహిళ విదేశాల్లో వీసా కోసం దళారులకు నగదు ఇచ్చి మోసపోయింది. ఆ వివరాలు తెలుసుకున్న సందీప్‌ ఏపీ హైకోర్టు జస్టిస్‌ తన సోదరి అని, నగదు, వీసా కూడా ఇప్పిస్తానని ఆ మహిళను నమ్మించాడు. మగ గొంతు ఆడ గొంతుగా మారే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. 
 
తొలుత సైబరాబాద్‌ సీపీకి ఫోన్‌ చేసి తాను ఏపీ హైకోర్టు జస్టిస్‌ను మాట్లాడుతున్నానని చెప్పడంతో సీపీ... డీసీపీకి ఫోన్‌ చేయాలని సూచించారు. డీసీపీ నుంచి ఏసీపీ, సీఐ, ఎఎస్ఐలకు వందలసార్లు ఫోన్‌ చేసేవాడు. జస్టిస్‌ చెప్తుంటే పట్టించుకోరా అంటూ మహిళకు న్యాయం చేయాలని ఆదేశించినట్లు మాట్లాడేవాడు. అదే మహిళ నుంచి భూవివాదం పరిష్కరిస్తానని రూ.50 వేలు వసూలు చేశాడు. సందేహం వచ్చిన పోలీసులు సందీప్‌పై నిఘాపెట్టారు. ఎట్టకేలకు సూడో జస్టిస్‌గా అవతారమెత్తాడని గుర్తించిన పోలీసులు కేపీహెచ్‌బీ పోలీసులు ఆ కేటుగాడిని రిమాండ్‌కు తరలించారు.