గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 18 ఫిబ్రవరి 2024 (16:11 IST)

హ్యాట్రిక్ విజయంపై అనుమానం అక్కర్లేదు : ప్రధాని నరేంద్ర మోడీ

narendramodi
కేంద్రంలో మరోమారు భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటవుతుందని, ఈ హ్యాట్రిక్ విజయంపై అనుమానం అక్కర్లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న భారతీయ జనతా పార్టీ జాతీయ మండలి సమావేశాల్లో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, నవభారత్‌ నిర్మాణం కోసం అహర్నిశలు పనిచేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వచ్చే వంద రోజులు పార్టీకి ఎంతో కీలకమని, ఈసారి 370 సీట్ల మైలురాయిని అందుకోవాలన్నారు. గడిచిన పదేళ్లలో దేశ రూపురేఖలు మారిపోయాయి. 25 కోట్లమంది పేదరికం నుంచి బయటపడ్డారు. భారత్‌ అభివృద్ధిని ప్రపంచమంతా గుర్తిస్తోంది. దేశం కోసం మనం చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఏక్‌భారత్‌, శ్రేష్ట్‌ భారత్‌ అన్నదే మన నినాదం అని పేర్కొన్నారు. 
 
అదేసమయంలో మూడోసారి గెలుపుపై ఎవరికీ ఎలాంటి అనుమానం అక్కర్లేదు. రాజకీయ పండితులెవరికీ మన గెలుపు కారణాలు దొరకవు. నేను వీధుల వెంట వెళ్తున్నప్పుడు ప్రజల ఆశీర్వాద వర్షం కురుస్తోంది. భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతీయ మూలసూత్రం. భిన్నత్వంలో ఏకత్వం మరింత బలోపేతం దిశగానే పనిచేస్తున్నాం అని వ్యాఖ్యానించారు. 
 
అలాగే, నిరంతర త్యాగాల వల్లే ప్రజల విశ్వాసం చూరగొన్నాం. ప్రతిపక్షాలు అని  చెప్పే పార్టీలన్నీ కుటుంబ పార్టీలే. అక్కడ అధికారం వారసత్వంగా సంక్రమిస్తుంది. భాజపా వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం. దేశంలో అనేక అనర్థాలకు కాంగ్రెస్‌ పార్టీయే కారణం. అధికారం సంపాదించాలనే ఆలోచన తప్ప దేశాభివృద్దికి ఆ పార్టీ వద్ద అజెండా లేదన్నారు. 
 
రక్షణ దళాల సామర్థ్యంపై కాంగ్రెస్‌కు స్పష్టత లేదు. నూతన సాంకేతిక పరిజ్ఞానం, నవీన ఆయుధ సంపత్తితో సైనిక దళాలను బలోపేతం చేశాం. కానీ, ఆ పార్టీ నిరంతరం రక్షణ దళాల సామర్థ్యాన్ని శంకిస్తుంది. ప్రజలందరికీ ఒక్కటే విజ్ఞప్తి. మోడీపై కోపంతో కాంగ్రెస్‌కు ఓటేస్తే పూడ్చలేని నష్టం జరుగుతుందని, ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.