బుధవారం, 6 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 ఆగస్టు 2025 (14:56 IST)

మద్యం మత్తులో చోరీకి వెళ్లి ఇంట్లోనే నిద్రపోయిన దొంగ

sleep
దొంగతనం చేయడానికి వెళ్లిన ఓ దొంగ మద్యం మత్తులో ఆ ఇంటిలోనే నిద్రపోయాడు. ఉదయాన్ని ఇంటి సభ్యులు నిద్రలేచి చూడగా, ఇంట్లో దొంగ నిద్రపోతుండటాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి దొంగను అరెస్టు చేసి ఠాణాకు తీసుకెళ్లారు. ఈ ఆసక్తికర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మరియంపూర్ రైల్వే లైన్ సమీపంలోని నజీరాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో సోదరులైన వినోద్ కుమార్, అనిల్ కుమార్‌లు పక్కపక్కనే ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నారు. అయితే, మద్యం సేవించిన ఓ దొంగ అర్థరాత్రి వేళ తొలుత వినోద్ ఇంట్లోకి చొరబడ్డాడు. అల్మారా లాకర్‌ను పగులగొట్టి విలువైన వస్తువులను దోచుకున్నాడు. ఆ తర్వాత పక్కనే ఉ్న అనిల్ ఇంట్లోకి ప్రవేశించాడు. అక్కడి అల్మారాను కూడా పగులగొట్టి అందులో ఉన్న నగలు, నగదు దోచుకున్నాడు. మద్యం మత్తులో నిద్ర ముంచుకురావడంతో ఆ ఇంటి లోపలున్న బెడ్‌పై పడుకుని గాఢనిద్రలోకి జారుకున్నాడు. 
 
మరోవైపు, ఆటో నడిపే అనిల్ మరునాడు ఉదయం నిద్రలేచాడు. గుర్తు తెలియని వ్యక్తి తన ఇంట్లోని బెడ్‌పై నిద్రిస్తుండటం చూసి షాకయ్యాడు. ఇంట్లో చూడగా కబోర్డ్ విరిగివుంది. అందులోని విలువైన వస్తువులు కనిపించలేదు. నిద్రిస్తున్న వ్యక్తి వద్ద వెతకగా చోరీ చేసిన నగలు, డబ్బులు కనిపించాయి. ఇంతలో అతని అరుపులు విన్న పక్కింటి వినోద్ భార్య కూడా నిద్రలేచింది. వారి ఇంట్లో కూడా చోరీ జరిగినట్టు ఆమె ఆగ్రహించింది. 
 
కాగా, ఈ రెండు కుటుంబాలు పొరుగువారిని అలెర్ట్ చేశారు. దీంతో ఆ దొంగను పట్టుకుని చితకబాది, నజీరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని దొంగను అదుపులోకి తీసుకుని ఠాణాకు తీసుకెళ్లారు. అతనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.