1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 జనవరి 2024 (09:17 IST)

ఆ ఇద్దరమ్మయాలు ఒక్కటయ్యారు.. వైవాహిక జీవితంలోకి ఎంట్రీ

two girls marriage
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు అమ్మాయిలు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. వారిద్దరూ సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. ఓ ఆర్గెస్ట్రాలో పని చేసే ఈ ఇద్దరు అమ్మాయిల మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత పెళ్ళి బంధంతో ఒక్కటి కావాలని నిర్ణయించుకుని వివాహం చేసుకున్నారు. పైగా, చట్టబద్ధ మార్గంలో అఫిడవిట్ తీసుకుని వీరిద్దరూ గుడిలో పెళ్లి చేసుకోవడం గమనార్హం. ఈ ఆసక్తికర ఘటన యూపీ రాష్ట్రంలోని డియోరియో జిల్లాలో వెలుగు చూసింది. 
 
పశ్చిమబెంగాల్ లోని 24 పరగణాలకు చెందిన జయశ్రీ రాహుల్ (28), రాఖీ దాస్ (23) అనే ఇద్దరు అమ్మాయిలు డియోరియాలో ఒక ఆర్కెస్ట్రా టీమ్ పని చేస్తున్నారు. ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టుగానే ధైర్యంగా ముందడుగు వేశారు. తొలుత వివాహానికి సంబంధించిన నోటరీ అఫిడవిట్‌ను తీసుకున్నారు. అనంతరం సోమవారం డియోరియాలోని భటపర్ రాణిలోని భగదా భవానీ ఆలయంలో ఏడడుగులు వేశారు.
 
అయితే కొన్ని రోజుల క్రితమే వీరి పెళ్లి జరగాల్సి ఉంది. దీర్ఘశ్వరనాథ్ ఆలయానికి వెళ్లగా అక్కడ అనుమతి ఇవ్వలేదు. జిల్లా అధికారుల అనుమతి లేకపోవడంతో వారిని తిప్పి పంపించారు. దీంతో ఇద్దరూ చట్టబద్ధమైన మార్గాన్ని ఆశ్రయించారు. తమకు తెలిసిన వ్యక్తుల సాయంతో పెళ్లికి నోటరీ అఫిడవిట్‌ను పొందారు. ఆ తర్వాత మఝౌలీరాజ్‌లోని భగడ భవానీ ఆలయానికి వెళ్లి ఆలయ పూజారి సమక్షంలో దండలు మార్చుకున్నారని ఆర్కెస్ట్రాకు చెందిన మున్నా పాల్ అనే వ్యక్తి తెలిపాడు. కాగా పెళ్లి తర్వాత దంపతులు తమ ప్రేమ కథ ఎలా మొదలైంది, ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు, చివరికి ఎలా ఒక్కటయ్యారన్న విషయాలను అక్కడివారితో పంచుకున్నారు.