ఇద్దరు బాలికలు .. 8 మంది యువకులు.. అడవిలోకి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన త్రిపురలో ఇద్దరు బాలికలు సామూహిక అత్యాచారానికి గురయ్యారు. ఈ దారుణానికి ఎనిమిది మంది యువకులు పాల్పడ్డారు. ఖౌవాయి జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఈ సామూహిక లైంగికదాడిలో తీవ్రంగా గాయపడిన ఓ బాలిక పరిస్థితి విషమంగా ఉంది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఖటియాబరి ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలికలు తమ ఇద్దరు స్నేహితులతో కలిసి సోమవారం సాయంత్రం బైక్‌పై బయటకు వెళ్లారు. కొంతదూరం వెళ్లిన తర్వాత మరో ఆరుగురు యువకులు బైక్‌లపై వచ్చి వారిని కలిశారు.
ఆ తర్వాత వారంతా కలిసి ఆ ఇద్దరు బాలికలను అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికలు అపస్మారక స్థితికి వెళ్లడంతో భయపడిన యువకులు వారిని అక్కడే వదిలేసి పరారయ్యారు.
బాలికలు కనిపించకపోవడంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారితో కలిసి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో అడవిలో అపస్మారకస్థితిలో ఉన్న బాలికలు కనిపించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఓ బాలిక పరిస్థితి విషమంగా మారడంతో ఆమెను మరో ఆసుపత్రికి తరలించారు. ఎనిమిది మంది కామాంధులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.