వ్యాక్సిన్ల ధరలపై మీరు వేలెట్టొద్దు : సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్
దేశంలో వ్యాక్సిన్ల ధరలు, వ్యాక్సిన్ల కొరత, వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతున్న ప్రక్రియపై కేంద్రం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. దీంతో కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం. తాము అనుసరిస్తున్న వ్యాక్సినేషన్ విధానాన్ని పూర్తిగా సమర్థించుకుంది.
ఈ విషయంలో న్యాయవ్యవస్థ జోక్యం అనసవరం అని తేల్చిచెప్పింది. వ్యాక్సిన్లపై నిర్ణయాలను మాకు వదిలేయండి. ఈ నిర్ణయాన్ని ప్రజల ప్రయోజనార్థం మెడికల్, సైంటిఫిక్ ఎక్స్‌పర్ట్స్ సూచనల మేరకు తీసుకున్నామని స్పష్టం చేసింది.
ఆదివారం అర్థరాత్రి వేళ సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. సోమవారం దీనిపై కోర్టు విచారణ జరపనుంది. వ్యాక్సిన్ల ధరలను మరోసారి పరిశీలించాలని గతవారం కేంద్రాన్ని ఆదేశించింది. అయితే ఈ విషయంలో మాత్రం కోర్టు జోక్యం వద్దని కేంద్రం వాదిస్తోంది.
అత్యున్నత స్థాయిలో సంప్రదింపులు, చర్చలు జరిపిన తర్వాతే ఈ నిర్ణయాలు తీసుకున్నాం. ఇందులో న్యాయ వ్యవస్థ జోక్యం అనవసరం. ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా పాలకులకే ఈ నిర్ణయాన్ని వదిలేయండి అని తన అఫిడవిట్‌లో కేంద్రం స్పష్టం చేసింది.
వ్యాక్సిన్ తయారీ సంస్థలు సీరం, భారత్ బయోటెక్‌లు కేంద్రానికి ఒక ధర, రాష్ట్రాలకు మరో ధర నిర్ణయించడంపై విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. కేంద్రానికి ఈ రెండు వ్యాక్సిన్లను రూ.150కే అమ్ముతున్న సంస్థలు రాష్ట్రాల విషయానికి వస్తే సీరం రూ.300, భారత్ బయోటెక్ రూ.400 వసూలు చేయనున్నాయి. పైగా, గతంలో అనుసరించిన జాతీయ టీకా విధానానికి కేంద్రం మంగళం పాడింది. దీనిపై కూడా కేంద్రం విమర్శలుపాలవుతుంది.