శనివారం, 14 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 జులై 2022 (10:53 IST)

పాము కాటుకు మరణించిన కుమారుడు.. బతికొస్తాడంటూ పూజలు

Snake
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పాము కాటుడు ఓ బాలుడు మరణించాడు. కానీ, అతని తల్లిదండ్రులకు మాత్రం తమ కుమారుడిపై ఉన్న ప్రేమ చనిపోలేదు. బాలుడు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించినప్పటికీ అంత్యక్రియలు చేసేందుకు సమ్మతించలేదు. పైగా, తమ బిడ్డ బతికివస్తాడన్న ఆశతో 30 గంటల పాటు వివిధ రకాల పూజలు చేశారు. అప్పటికీ అతనిలో ఎలాంటి చలనం లేకపోవడంతో చనిపోయాడని నమ్మి అంత్యక్రియలు చేశారు 
 
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మెయిన్‌పురి జిల్లా జాటవాన్‌ మొహల్లా గ్రామంలో జరిగింది ఈ గ్రామానికి చెందిన తాలీబ్‌ అనే బాలుడిని శుక్రవారం పాము కాటేసింది. ఆ తర్వాత ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 
 
అయినా కుటుంబ సభ్యులు, గ్రామస్థులు నమ్మలేదు. ఎలాగైనా బతికించుకోవాలన్న ఉద్దేశంతో తాంత్రికులను, పాములను పట్టే వారిని తీసుకొచ్చారు. సుమారు 30 గంటల పాటు పూజలు చేశారు. 
 
తాలీబ్‌ను కాటేసిన పామును పట్టుకునేందుకు నలుగురిని రప్పించారు. యువకుడి మృతదేహం వద్ద వేప, అరటి కొమ్మలను పెట్టి పూజలు చేశారు. ఎంత శ్రమించినా తాలీబ్‌లో చలనం లేకపోవడంతో ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు పూర్తి చేశారు.