భార్యను పూజ పేరుతో చెరువు వద్దకు తీసుకొచ్చి.. నీటిలో ముంచి చంపేసిన భర్త
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో ఓ దారుణం జరిగింది. తన భార్యను పూజ పేరుతో చెరువు వద్దకు తీసుకొచ్చిన భర్త.. చెరువు నీటిలో భార్యను ముంచి చంపేశాడు. ఇంటి నుంచి ఎంతో అన్యోన్యంగా కలిసి చెరువు వద్దకు పూజ కోసం వచ్చారు. ఇంతలో ఏం జరిగిందో ఏమో తెలియదుగానీ, భార్యను నీటిలో ముంచి చంపేశాడు.
పూజ కోసం చెరువు వద్దకు వచ్చిన భార్యాభర్తలు అక్కడ చాలా సేపు ఏదో విషయంపై మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ వాదనలో భర్త తన కోపాన్ని నియంత్రించుకోలేక చెరువు నీటిలో భార్యను ముంచేసి చంపేశాడు. దీన్ని గమనించిన స్థానికులు అక్కడకు చేరుకుని ఆమెను రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలిని తరానా బానోగా గుర్తించారు. ఆమె భర్తను మహ్మద్ ఆరిఫ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో.. తారానా ఆరోగ్యం చాలా కాలంగా చెడిపోయిందని, నిందితుడు శనివారం తన అత్తమామల ఇంటికి చేరుకుని భార్యను భూతవేద్యం కోసం బరౌలికి తీసుకొచ్చాడు. ఆ సమయంలో మద్యం సేవించివున్న ఆరిఫ్... భార్యతో గొడవపడి ఈ దారుణానికి పాల్పడినట్టు వెల్లడించారు.