శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

నా భర్త హిందువు.. అందువల్ల ఇపుడు నేను భారతీయురాలినే : పాకిస్థాన్ మహిళ

pak woman
సోషల్ మీడియాలో పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన భారతీయ యువకుడిని వివాహం చేసుకున్న పాకిస్థాన్ దేశానికి చెందిన నలుగురు పిల్లల తల్లి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన భర్త ఒక హిందువు అని, అందువల్ల ఇపుడు తానుకూడా భారతీయురాలినేనని అంటుంది. 
 
భారత కుర్రాడితో ప్రేమలో పడిన పాకిస్థాన్ మహిళ నేపాల్ దేశం మీదుగా సరిహద్దులు దాటి భారత్‌కు వచ్చిన ఈ మహిళ పేరు సీమా సీదర్ (30). వివాహమై నలుగురు పిల్లలున్న ఆమె నేపాల్ మీదుగా గ్రేటర్ నోయిడాలోని ప్రియుడు సచిన్ (25) వద్దకు చేరుకుంది. 
 
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వీసా లేకుండా అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన కారణంగా ఈ నెల 4న పోలీసులు అరెస్టు చేశారు. ఆమె బెయిల్‌‍పై శనివారం విడుదలయ్యారు. ఆమెకు ఆశ్రయం ఇచ్చిన సచిన్‌ను కూడా అరెస్ట్ చేశారు. బెయిలుపై బయటకు వచ్చిన సీమా పై విధంగా మాట్లాడింది. 
 
కాగా, వీరి ప్రేమ కథ బాలీవుడ్ సినిమాను తలపించింది. కరోనా సమయంలో పబ్ గేమ్ ద్వారా ఇద్దరికీ పరిచయమైంది. అప్పటికే నలుగురు పిల్లల తల్లయిన సీమా ప్రియుడిని విడిచి ఉండలేనంత ప్రేమలో కూరుకుపోయింది. దీంతో అతడితో కలిసి జీవించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చిలో నేపాల్లో కలుసుకుని వివాహం చేసుకున్నారు.
 
'ఇది చాలా సుదీర్ఘమైన, కఠినమైన ప్రయాణం. నేను భయపడ్డాను కూడా. తొలుత కరాచీ నుంచి దుబాయ్ వెళ్లాను. అక్కడ నేను నిద్రపోకుండా 11 గంటలపాటు వేచి చూశాను. అక్కడి నుంచి నేపాల్ చేరుకున్నాను. ఆ తర్వాత రోడ్డు మార్గంలో పోఖ్రాన్ చేరుకుని అక్కడ సచిన్‌ను కలుసుకున్నాను' అని
సీమా వివరించింది.
 
నేపాల్లో వివాహం తర్వాత సీమా పాకిస్థాన్ వెళ్లిపోగా, సచిన్ ఇండియా వచ్చేశాడు. పాక్ వెళ్లిపోయిన సీమా ఓ ప్లాట్‌ను రూ.12 లక్షల (పాకిస్థానీ రూపాయలు)కు విక్రయించింది. ఆ తర్వాత తనకు, నలుగురు పిల్లలకు నేపాల్ వీసా సంపాదించింది. మేలో పోఖ్రాన్ చేరుకున్న ఆమె అక్కడి నుంచి మే 13న గ్రేటర్ నోయిడాలో అడుగుపెట్టారు. 
 
అప్పటికే ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న సచిన్ కలిసి ఉండేందుకు పూర్తి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆమె పాకిస్థాన్ మహిళ అని తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ నెల 4న వారి అరెస్టుతో విషయం బయటకు వచ్చి సంచలనమైంది.
 
వారిద్దరూ శనివారం బెయిలుపై విడుదలైన సీమా ఇండియాకు అధికారికంగా వచ్చేందుకు ఏం చేయాలన్నదానిపై దృష్టిసారించింది. తాను చాలాకాలంపాటు జైలులో గడపాల్సి వస్తుందని భావించానని, బెయిలు వచ్చిందని తెలియగానే ఆనందం పట్టలేక గట్టిగా అరిచానని పేర్కొంది.