శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 మార్చి 2021 (14:35 IST)

ఎక్కువ రేషన్ కావాలా? 20 మంది పిల్లన్ని ఎందుకు కనలేదు? : ఉత్తరాఖండ్ సీఎం

ఎక్కువ మొత్తంలో రేషన్ సరకులు కావాలంటే 20 మంది పిల్లన్ని ఎందుకుకనలేదని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ వ్యాఖ్యానించారు. దీంతో ఆయన చిక్కుల్లోపడ్డారు. 
 
కరోనా కష్టకాలంలో అనేక పేద కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయని... వారికి ప్రభుత్వం ఇస్తున్న ఎక్కువ రేషన్ కావాలంటే ఎక్కువ మంది పిల్లలు ఉండాలని చెప్పారు.
 
ఒక్కో వ్యక్తికి నెలకు 5 కిలోల బియ్యం ఇస్తున్నామని... ఒక కుటుంబంలో 10 మంది ఉంటే 50 కేజీలు అందుతున్నాయని తెలిపారు. 20 మంది కుటుంబ సభ్యులున్న వారికి క్వింటా బియ్యం వస్తోందన్నారు.
 
దీంతో ఇద్దరు కుటుంబ సభ్యులు ఉన్నవారు ఓర్చుకోలేపోతున్నారని అన్నారు. మీకు సమయం ఉన్నప్పుడు కేవలం ఇద్దరు పిల్లలను మాత్రమే కన్నారని... 20 మందిని ఎందుకు కనలేదని ఆయన ప్రశ్నించారు. 
 
మహిళల వస్త్రధారణపై కూడా కొన్ని రోజుల క్రితం ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిరిగిన జీన్స్ ధరిస్తున్నారని మండిపడ్డారు. అమెరికన్లు భారతీయతను పాటిస్తుంటే... మనం మాత్రం నగ్నత్వం వైపు పరుగులు తీస్తున్నామని అన్నారు. ఆదివారం ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ అమెరికా భారత్‌ను 200 ఏళ్ల పాటు పాలించిందని నోరు జారి, నాలుక కరుచుకున్నారు. 
 
ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్ 
ఇదిలావుంటే,దేశంలో కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ ప్రారంభమైందని కేంద్రం హెచ్చరిస్తోంది. పలువురు రాజకీయవేత్తలు, సెలబ్రిటీలు, క్రీడాకారులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. 
 
తాజాగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ కు కరోనా సోకింది. తనకు నిర్వహించిన కరోనా టెస్టులో పాజిటివ్ అని తేలిందని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం బాగానే ఉన్నానని... ఎలాంటి ఆందోళన చెందడం లేదని చెప్పారు. 
 
హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నానని... డాక్టర్లు తన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారన్నారు. ఇటీవలి కాలంతో తనకు కాంటాక్ట్‌లోకి వచ్చిన వారంతా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని కోరారు.