చిరిగిపోయిన దుస్తులు.. కత్తెర సంస్కృతికి నిదర్శనం : ఉత్తరాఖండ్ సీఎం
అమ్మాయిలు చిరిగిపోయిన దుస్తులు ధరించడమే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదమయ్యాయి. మాదక ద్రవ్యాల వినియోగంపై నిర్వహించిన ఓ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ, అమ్మాయిలు చినిగిపోయిన జీన్స్ ధరించడం సమాజ విచ్ఛిత్తికి దారితీస్తుందన్నారు.
ఇలాంటి వస్త్రధారణతో భవిష్యత్ తరాలకు ఏం సందేశమిస్తారని ఆయన నిలదీశారు. ఇలాంటి వస్త్రధారణ మాదకద్రవ్యాల వినియోగానికి దారితీస్తుందన్నారు. చిరిగిన డెనిమ్ జీన్స్ ధరిస్తూ ఎక్స్‌పోజింగ్ చేయడం, అవి ధరించడం స్టేటస్ సింబల్‌గా భావించడం నేటి తరాలు సంస్కృతిగా భావించడం దురదృష్టకరమన్నారు
ఇది కేవలం కత్తెర సంస్కృతి( కైంచ్ సే సంస్కార్) మాత్రమేనని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ విమానంలో తన పక్కన కూర్చున్న ఓ మహిళ వస్త్రధారణ గురించి ఆయన వివరిస్తూ, ఆ మహిళ బూట్లు, మోకాళ్ల వద్ద చిరిగిన జీన్స్ ధరించిందని, ఆమె చేతులకు చాలా గాజులున్నాయని చెప్పారు. ఆమెతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ప్రయాణిస్తున్నారని చెప్పారు.
ఆమె ఒక స్వచ్ఛంద సంస్థ(ఎన్‌జిఓ)ను నడుపుతారని అంటూ, చిరిగిన జీన్స్ ధరించి సేవ చేస్తూ ఆమె సమాజానికి ఏం సందేశం ఇస్తారని ప్రశ్నించారు. అయితే రావత్ వ్యాఖ్యలపై రాజకీయ పార్టీలకు చెందిన వారితో పాటు పలువురు మహిళలు మండిపడుతున్నారు. రావత్ వ్యాఖ్యలు సిగ్గుచేటని ఉత్తరాఖండ్ కాంగ్రెస్ చీఫ్ ప్రీతమ్ సింగ్ వ్యాఖ్యానించారు. మహిళలకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే, అమితాబ్ బచ్చన్ సతీమణి జయా బచ్చన్ కూడా సీఎం వ్యాఖ్యలను ఖండించారు.