సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 10 మార్చి 2021 (13:10 IST)

పెళ్ళాం డబ్బులతో ముగ్గురు మహిళలతో అక్రమ సంబంధం, ప్రశ్నించినందుకు...

ఉద్యోగం చేయడు. ఇంట్లోనే తిరుగుతూ ఉంటాడు. భార్య పుట్టింటి నుంచి తీసుకొచ్చే డబ్బులను వాడుకోవడం ఇతనికి అలవాటు. ఇంట్లో ఉన్న డబ్బులు, నగలు మొత్తాన్ని ఖర్చు చేసేశాడు. ఇంట్లో ఇంకేమీ లేదు. పెళ్ళి చేసుకున్న భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ప్రతినెలా డబ్బులు తీసుకురమ్మని వేధించేవాడు.
 
తమిళనాడు రాష్ట్రం తేని జిల్లాలోని చిన్నమన్నూర్ ప్రాంతానికి చెందిన అన్బరసన్‌కు అదే ప్రాంతానికి చెందిన చిత్రకు నాలుగేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మొదట్లో స్థానికంగా ఉన్న ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్న అన్బరసన్ ఆ తరువాత పని మానేశాడు.
 
స్నేహితులతో కలిసి మద్యం సేవించడం.. బలాదూర్‌గా తిరగడం ఇతనికి ఉన్న అలవాటు. అది కాస్త కుటుంబంలో గొడవలకు కారణమయ్యేది. ఇంట్లో తల్లిదండ్రులు సంపాదించే డబ్బు, ఇంట్లోని నగలు మొత్తాన్ని కుదవ పెట్టి మద్యం తాగడం మొదలుపెట్టాడు. 
 
ఇంట్లో ఉన్నదంతా అయిపోయింది. ఇక భార్యను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. ఆర్థికంగా బాగా లేని చిత్ర కుటుంబం నుంచి పదే పదే డబ్బులు తీసుకురమ్మని అన్బరసన్ వేధించేవాడు. దీంతో గత మూడు నెలల నుంచి భార్య వేధింపులను భరిస్తూ వస్తోంది. ఎలాగో డబ్బును అప్పు చేసి తీసుకువచ్చి ఇచ్చేది. ఈ డబ్బును తీసుకుని పరాయి మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. 
 
ముగ్గురు మహిళలతో శారీరక సంబంధం పెట్టుకున్నట్లు భార్యకు తెలిసింది. అలా చేయొద్దని ప్రాథేయపడింది చిత్ర. వినిపించుకోలేదు. రోజూ మద్యం సేవించడం.. మహిళలతో ఎంజాయ్ చేయడం.. భార్య తీసుకొచ్చిన డబ్బులను తగలేయడం..ఇదే అలవాటుగా చేసుకున్నాడు.
 
ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలకు తిండి పెట్టలేక.. భర్త వేధింపులు తట్టుకోలేని ఆ అభాగ్యురాలు ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పక్కింటి వారు గుడికి వెళ్ళేటప్పుడు వారితో పాటు పిల్లలను పంపించింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు భర్తే కారణమని సుసైడ్ నోట్ రాసింది చిత్ర. భార్య ఆత్మహత్య చేసుకున్నదని తెలియగానే ఆమె భర్త పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.