కరోనా టీకాలు వేయించుకున్న మహిళల్లో సైడ్‌ఎఫెక్ట్స్!
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రస్తుతం కొన్ని రకాలైన టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ టీకాల వినియోగం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సాగుతోంది. అయితే, ఈ టీకాలు వేయించుకుంటున్న వారిలో ఒకరిద్దరు మృత్యువాతపడుతున్నారు. అలాగే, పలువురు మహిళల్లో సైడ్‌ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయనే ఫిర్యాదులు అందుతున్నాయి. ముఖ్యంగా మహిళల నుంచి ఇటువంటి ఫిర్యాదులు అందుతున్నాయి.
ప్రస్తుతం, భారత్, అమెరికా వంటి దేశాల్లో ఈ కరోనా టీకాల పంపిణీ జోరుగా సాగుతోది. ఈ టీకాలు వేయించుకున్న మహిళలు తాము టీకా వేయించుకున్నాక పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు.
అమెరికాలోని స్టేట్ కాలేజ్ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందిన 44 ఏళ్ల మెడికల్ టెక్నీషియన్ షెలీ కెండెఫీ ఇలీవలే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే ఆ తర్వాత ఆమె అనారోగ్యానికి గురయ్యారు. ఆమె మోడరనా కంపెనీ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. టీకా తీసుకున్నప్పుడు సాధారణంగానే ఉన్నప్పటికీ ఆ రోజు సాయంత్రం నుంచి ఆమెకు అనారోగ్యం వాటిల్లింది. శరీరంపై దురద ఏర్పడింది. దీంతో ఆమె చాలా ఇబ్బంది పడింది. ఫ్లూ లక్షణాలు కనిపించాయి.
అలాగే, మోడరనా వ్యాక్సిన్ వేయించుకున్న మరో ఆరుగురు మహిళ్లల్లోనూ ఇటువంటి లక్షణాలే కనిపించాయి. గత నెలలో సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‌కు చెందిన నిపుణులు నిర్వహించిన పరిశోధనలో 1.37 కోట్ల మంది అమెరికన్లు టీకాలు వేయించుకోగా, వారిలో 79.1 శాతం మహిళలలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి.
కాగా ఈ విషయమై జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన మైక్రో బయాలజిస్ట్ సబ్రా క్లీన్ మాట్లాడుతూ మహిళలలో సైడ్ ఎఫెక్ట్స్ స్వల్పస్థాయిలోనే కనిపిస్తున్నాయని, అవి కొద్ది సమయం మాత్రమే ఉంటున్నాయని అన్నారు. శరీరంలో మార్పులే దానికి కారణమని వ్యాక్సిన్ ప్రభావం కాదని స్పష్టం చేశారు.