శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 10 మార్చి 2021 (13:05 IST)

బ్యాంకు ఉద్యోగుల పేరుతో ఒంటరిగా యువతిపై అత్యాచారం...

ఇటీవలి కాలంలో తమ ఇళ్ళలో ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలోని పంజాగుట్టలో ఒంటరిగా ఉన్న ఓ యువతిపై ఇద్దరు వ్యక్తులు బ్యాంకు ఉద్యోగుల పేరుతో అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని డీఎస్‌ మక్తాలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. ఇటీవల కుటుంబ సభ్యులు మహారాష్ట్రకు వెళ్లగా యువతి(23) ఇంట్లోనే ఉంటోంది. 
 
మంగళవారం సాయంత్రం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఓ ప్రైవేటు బ్యాంకు ఉద్యోగులమని, ఫైనాన్స్‌ ఇస్తామని యువతి ఉంటున్న ఇంటికి వచ్చారు. ఒక వ్యక్తి ఇంటి బయట కాపలా ఉండగా.. మరో వ్యక్తి యువతితో ఫైనాన్స్‌ గురించి మాటలు కలిపి ఆపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ కామాంధుల చెర నుంచి తప్పించుకునేందుకు యువతి బిగ్గరగా కేకలు వేయడంతో వారు పారిపోయారు. 
 
ఈ ఘటనపై యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సతీశ్‌కుమార్‌ తెలిపారు. కేసును ఛేదించడానికి పోలీసులు ఘటనా ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.