1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 31 మార్చి 2021 (13:24 IST)

సింహానికి సున్నితమైన హృదయం ఉంది.. బాతుకు సాయం... ఎలా?(Video)

అడవికి రారాజు సింహం. దాన్ని చూస్తే అడవి జంతువులన్నీ ప్రాణ భయంతో పరుగులు తీయాల్సిందే. అలాంటి క్రూర జంతువైన సింహం.. ఓ బాతు పిల్లకు సాయం చేసింది. ఈ క్రూర మృగాలు కూడా ఆక‌లి వేసిన‌ప్పుడే త‌ప్ప ఆకార‌ణంగా ఏ జంతువుకు హాని త‌ల‌పెట్ట‌వ‌ని జంతు ప్రేమికులు చెబుతుంటారు. వారు చెప్పేది నిజ‌మేన‌ని తాజాగా ఓ సింహం నిరూపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఇంత‌కూ ఆ సింహ రాజు చేసిన గొప్ప ప‌ని ఏమిటంటే చెరువు ఒడ్డుకు వ‌చ్చి ఈదడానికి ఇబ్బంది ప‌డుతున్న ఓ బాతుపిల్లను ముందు కాళ్ల‌తో తిరిగి నీటిలోప‌లికి తోసేసి సులువుగా ఈదేందుకు సాయప‌డింది. సింహం బాతుపిల్ల‌కు సాయం చేస్తున్న ఆ దృశ్యం అక్క‌డే ఉన్న‌ కెమెరాకు చిక్కింది. 
 
ఆ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ అధికారి సుశాంత నంద త‌న ట్విట్టర్ ఖాతా​లో షేర్ చేశారు. "ఇంత పెద్ద మాంసాహార‌‌ జంతువుకు కూడా సున్నితమైన హృదయం ఉందని మీలో ఎంత మందికి తెలుసు..? అవి అడవి మృగాలే త‌ప్ప క్రూర మృగాలు కాదు. ఆహారం కోసం మాత్ర‌మే ఇత‌ర జంతువులను వేటాడి చంపుతాయి. కాబ‌ట్టి వాటి గురించిన చెడు అభిప్రాయాన్ని తొలగించుకుని ఆదరించండి" అని ఆయ‌న క్యాప్ష‌న్ కూడా ఇచ్చారు.
 
ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే 10 వేల మందికి పైగా ఆ వీడియోను వీక్షించారు. అయితే, ఆ వీడియోకు నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన వ‌స్తున్న‌ది. కొంతమంది సుశాంత నంద అభిప్రాయంతో ఏక‌భ‌వించ‌గా, మరికొంత మంది మాత్రం సింహం ఆ బాతును కాపాడినట్లే కాపాడి తింటుందని అభిప్రాయపడ్డారు.