గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 7 డిశెంబరు 2017 (13:15 IST)

రేస్‌లోకి "పందెం కోడి"... విశాల్ నామినేషన్ పునఃసమీక్షకు ఈసీ ఆదేశం?

ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో పోటీచేసి తన సత్తాచాటాలని భావించిన సినీహీరో విశాల్ దాఖలు చేసిన నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించగా, ఇపుడు ఆ నామినేషన్‌ను పునఃసమీక్షించాల్సిందిగా ఎన్నికల సంఘం ఆద

ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో పోటీచేసి తన సత్తాచాటాలని భావించిన సినీహీరో విశాల్ దాఖలు చేసిన నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించగా, ఇపుడు ఆ నామినేషన్‌ను పునఃసమీక్షించాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశించనుందే వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీనికి బలమైన కారణం కూడా లేకపోలేదు. 
 
ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంతో ఆమె ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన చెన్నై ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక ఈనెల 21వ తేదీన నిర్వహించేందుకు ఈసీ నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు హీరో విశాల్ కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అయితే, పలు నాటకీయ పరిణామాల మధ్య విశాల్ నామినేషన్ పత్రాన్ని మంగళవారం అర్థరాత్రి రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. 
 
అయితే ఈ వ్యవహారం ఇప్పుడు మరోమలుపు తిరిగేలా కనిపిస్తోంది. విశాల్ నామినేషన్‌ను పున:సమీక్షించనున్నారనే ప్రచారం జరుగుతోంది. తన నామినేషన్‌ను తిరస్కరించడంపై విశాల్ తమిళనాడు రాష్ట్ర ప్రధాన ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజేశ్ లఖానీని కలిసి ఓ నివేదిక సమర్పించారు. ఇందులో నామినేషన్‌ను తిరస్కరించడం.. తర్వాత ఆమోదించడం.. మళ్లీ తిరస్కరించడం.. ఆ తర్వాత జరిగిన హైడ్రామాపై పూర్తి ఆధారాలతో కూడిన వివరణ ఇచ్చారు. ఈ నివేదికను ప్రధానాధికారి సమీక్షిస్తున్నారు. 
 
అయితే ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్‌పై పున:సమీక్షించమని ఆదేశించడానికి అవకాశం లేదు. కానీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 నిబంధన ప్రకారం తిరస్కరణకుగురైన నామినేషన్‌ను తిరిగి పరిశీలించమని రిటర్నింగ్ అధికారిని ఆదేశించే అధికారం ఎన్నికల సంఘానికి ఉందని పలువురు న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఆర్‌పీ(రిప్రెజెంటేషన్ ఆఫ్ ది పీపుల్స్ యాక్ట్) చట్టం సెక్షన్ 36(5) ప్రకారం దాఖలు చేసిన పత్రాలలోని వివరాలపై ఎలాంటి అభ్యంతరాలైనా వుంటే వివరణ కోసం ఒకరోజు గడువు ఇవ్వాల్సి ఉంటుందని వారు చెపుతున్నారు. ఈ అంశాలనే విశాల్ తన నివేదికలో ప్రధానంగా ప్రస్తావిస్తూ తన నామినేషన్‌ పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. పైగా, తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రిటర్నింగ్ అధికారి తన నామినేషన్‌ను తిరస్కరించినట్లు ప్రకటించారని ఆరోపించారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ఈసీ విశాల్ నామినేషన్‌ను పునఃసమీక్షించమని ఆదేశించవచ్చని తెలుస్తోంది.