యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నాం : వైమానిక దళ చీఫ్ భదౌరియా
తాము యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నట్టు భారత వైమానిక దళ అధిపతి మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా వెల్లడించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, భవిష్యత్‌లో ఎలాంటి యుద్ధం వచ్చినా.. దాంట్లో విజయం సాధించే రీతిలో మన దళాలు ఉన్నట్లు ఆయన తెలిపారు.
పొరుగు దేశాల నుంచి ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో యుద్ధ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. ''నేను మీతో నమ్మకంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నానని, మన దళాలు ఉత్తమంగా ఉన్నట్లు'' ఆయన వెల్లడించారు.
అన్ని కీలక ప్రాంతాల్లో దళాలను మోహరించామని, లడాఖ్ అనేది చిన్న భాగమన్నారు. యుద్ధ విమానాలైన రాఫెల్స్, చినూక్‌లు, అపాచీలను అతి తక్కువ సమయంలో ఆపరేట్ చేశామని, రానున్న మూడేళ్లలో రాఫెల్స్, ఎల్‌సీఏ మార్క్ 1 స్క్వాడ్రన్లు పూర్తి సామర్థ్యంతో పనిచేయనున్నట్లు ఆయన చెప్పారు.
లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ విమానాలపై నమ్మకాన్ని పెంచుకున్నామని, రానున్న అయిదేళ్లలో మరో 83 ఎల్‌సీఏ మార్క్ 1 విమానాలకు ఆర్డర్ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. స్వదేశీ ఉత్పత్తిలో డీఆర్‌డీవో, హెచ్ఏఎల్‌కు సపోర్ట్ ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. హెచ్‌టీటీ40, లైట్ కంబాట్ హెలికాప్టర్లకు సంబంధించి త్వరలో ఒప్పందం చేసుకోనున్నట్లు తెలిపారు.
చైనాతో సరిహద్దు వివాదం నెలకొన్న నేపథ్యంలో లడఖ్‌లో వైమానిక దళాల మోహరింపై భదౌరియా కామెంట్ చేశారు. అన్ని క్రియాశీలక స్థావరా(ఆపరేషన్ల లొకేషన్లు)ల్లో తమ దళాలు ఉన్నట్లు ఆయన చెప్పారు. ఎటువంటి విపత్తు ఎదురైనా, దాన్ని ఎదుర్కొనేందుకు బలమైన, స్థిరమైన రీతిలో దళాలను మోహరించినట్లు ఆయన వివరించారు.